- బడ్జెట్ అంచనాలు రూపొందించాలని ఆదేశం
మెదక్, వెలుగు: అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడ్ మండలాల్లోని చెరువు కట్టల పునరుద్ధరణ పనులపై మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం తన ఇంట్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో ఉన్న చెరువులు, కుంట కట్టల మరమ్మతులు, పీడర్ కెనాల్ పునరుద్ధరణ పనులు, పంట కాల్వల నిర్మాణం, పునరుద్ధరణ పనులపై చర్చించారు.
టేక్మాల్ మండలంలోని చిన్నచెరువు, పెద్ద చెరువు, అల్లాదుర్గ్ లోని పటేల్ చెరువు, అల్లాదుర్గ్ చెరువు, బోల్కం చెరువు, గడ్డి పెద్దాపూర్ చెరువు, అప్పాజిపల్లి గిద్దమ్మ చెరువు, రామ్ పూర్ చెరువు, ముప్పారం చెరువు, నల్లకుంట చెరువుల కట్టల మరమ్మతులతో పాటు ఫీడర్ కెనాల్, పంట కాల్వల నిర్మాణం, రేగోడ్ మండలంలోని రేగోడ్ పెద్ద చెరువు, గజ్వాడ , కోత్వాల్ పల్లి పెద్ద చెరువు కట్టల మరమ్మతు, ఫీడర్ కెనాల్, పంట కాల్వల పనుల పునరుద్ధరణ పనులపై మంత్రి దామోదర చర్చించారు. సమీక్షలో అల్లాదుర్గ్ మండలంలో ఉన్న 132, టేక్మాల్ మండలంలోని 135, రేగోడ్ మండలంలోని 91 చెరువులు, కుంటలు, ఫీడర్ ఛానల్ లు, పంట కాల్వల మరమ్మతు కోసం బడ్జెట్ అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను అదేశించారు.
అల్లాదుర్గ్ మండలంలోని చెరువుల, కుంటల కింద 5,778 ఎకరాల్లో సాగవుతున్న ఆయకట్టు, టేక్మాల్ మండలంలోని 5,802 ఎకరాల ఆయకట్టు, రేగోడ్ మండలంలోని 4,011 ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంతో పాటు అదనపు ఆయకట్టును పెంచటానికి చెరువుల మరమ్మతు పనులు ఈ సీజన్ లో పూర్తి చేసేలా అవసరమైన కార్యాచరణ ను రూపొందించాలని మంత్రి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. సమీక్షలో ఇరిగేషన్ శాఖ ఈఈ రవీంద్ర కిషన్, డిప్యూటీ ఈఈ సుబ్బలక్ష్మి, ఏఈలు పాల్గొన్నారు.
కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర
జోగిపేట: అందోల్లోని గోదా రంగనాథ స్వామి ఆలయంలో నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్, కృష్ణారెడ్డి, రామకృష్ణ, ప్రవీణ్, కిషన్, ప్రదీప్ గౌడ్ పాల్గొన్నారు.
