- సీఎం రేవంత్ రాసిన లేఖకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిప్లై
హైదరాబాద్, వెలుగు: డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ ఇచ్చారు. డీమ్డ్ వర్సిటీల ఏర్పాటు, వాటి ఆఫ్-క్యాంపస్ సెంటర్ల స్థాపన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేకంగా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాల ఎన్వోసీ అవసరమనే నిబంధనను ‘యూజీసీ రెగ్యులేషన్స్ 2023’లో చేర్చాలని కోరుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల లేఖ రాశారు.
దానికి తాజాగా కేంద్రమంత్రి లేఖ ద్వారానే వివరణ ఇచ్చారు. ‘‘రాష్ట్ర యూనివర్సిటీలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా నియంత్రణలో ఉంటాయి. కాబట్టి, అనుబంధ వర్సిటీల నుంచి అనుబంధ సంస్థలు ఎన్వోసీ పొందిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో ఎన్వోసీ అవసరం లేదు. ఈ నిబంధన డీమ్డ్ వర్సిటీల స్థాపన ప్రక్రియను సులభతరం చేస్తుంది. జాప్యాన్ని తగ్గిస్తుంది. పాత యూజీసీ రెగ్యులేషన్స్ 2019లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్వోసీ ఇవ్వాలనే నిబంధన లేదు.
అనుబంధ సంస్థలు 60 రోజుల్లోగా అనుబంధ వర్సిటీల నుంచి ఎన్వోసీ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలి’’ అని కేంద్రమంత్రి తన లేటర్ లో పేర్కొన్నారు. అయితే, ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ స్టేటస్ లేదా ఆఫ్ -క్యాంపస్‌లకు అప్లై చేస్తే, యూనివర్సిటీ లెవెల్‌లోనే కట్టడి చేసుకోవాలని కేంద్రం ఇన్‌డైరెక్ట్‌గా సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
