ప్రతిపక్ష నేతలకు మంత్రి ఈటల సవాల్‌‌

ప్రతిపక్ష నేతలకు మంత్రి ఈటల సవాల్‌‌

మేం చేసిన డెవలప్‌‌మెంట్‌‌ కనిపిస్తలేదా?

రాష్ట్రంలో ఉన్నన్ని స్కీమ్స్‌‌ మిగతా రాష్ట్రాల్లో చూపిస్తారా?

హైదరాబాద్‌‌, వెలుగు: ‘ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి. కానీ ప్రజల గుండెల్లో నిలవాలని, దేశానికి దిక్సూచిలా ఉండాలని సీఎం కేసీఆర్‌‌ చెప్పేవారు. సభ్యత మరిచి మాట్లాడుతున్న నాయకుల్లారా.. టీఆర్‌‌ఎస్‌‌ సర్కారు, కేసీఆర్‌‌ చేసిన పనులు కనిపించడం లేదా?. దేశంలో అనేక రాష్ట్రాల్లో పాలిస్తున్న మీరు ఇక్కడ ఉన్నన్ని పథకాలు మిగతా స్టేట్స్‌‌లో చూపిస్తారా? ఈ వేదిక మీద నుంచి సవాల్‌‌ చేస్తున్నా’ అని ఈటల రాజేందర్‌‌ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో కేటాయించిన స్థలంలో ముదిరాజ్ సంఘం భవనానికి మంత్రులు గంగుల కమలాకర్‌‌, తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌, సబితారెడ్డితో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. చాలా పార్టీలు సంస్కారం మరిచి మాట్లాడుతున్నాయని, అలాంటి పార్టీలకు టైమొచ్చినప్పుడు గుణపాఠం చెబుతామని అన్నారు. రాష్ట్రంలో 240 గురుకులాలు ఏర్పాటు చేసి ప్రతి స్టూడెంట్‌‌పై ఏటా రూ. లక్ష ఖర్చు చేస్తున్నామని.. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రాల్లో అందిస్తున్నారా అని ప్రశ్నించారు. ‘అడుక్కుంటే వచ్చేది కాయో పండో. కానీ హక్కులు రావు. హక్కుల కోసం కొట్లాడాల్సిందే. ఎక్కడ అణచివేత ఉంటుందో, ఎక్కడ ఆకలి ఉంటుందో అక్కడ ఈటల ఉంటాడు’ అన్నారు.

రాష్ట్రంలో 40 కులాలకు ఆత్మగౌరవ భవనాలు: గంగుల

బీసీలకు ఆత్మ గౌరవం పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌‌కే దక్కుతుందని మంత్రి గంగుల అన్నారు. ఉన్నత వర్గాలకు దీటుగా ఎదగాలని వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవ భవనాలను కేసీఆర్‌‌ కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలో 40 కులాలకు ఆత్మగౌవర భవనాలు కేటాయించామని, ఫిబ్రవరిలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఈ భూములన్నీ హెచ్‌‌ఎండీఏ ద్వారా అభివృద్ధి చేయిస్తామని వివరించారు.

చెరువుల మీద హక్కులు మత్స్యకారులవే: తలసాని

కుల సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు సీఎం చేపట్టారని మంత్రి తలసాని తెలిపారు. మత్స్యకారులకు ఫ్రీగా చేప పిల్లలు, ఫ్రీగా వెహికల్స్‌‌ అందించారన్నారు. చెరువుల మీద హక్కులు మత్స్యకారులవేనన్నారు. ‘ఎలక్షన్స్ రాగానే టెంప్ట్ అవ్వకండి. ఆదుకునే ప్రభుత్వానికి అండగా ఉండండి. తాడు బొంగరం లేని పార్టీల నాయకులు మాట్లాడేవి నమ్మకండి’ అని అన్నారు. అన్ని కులాలకు సీఎం సరైన ప్రాధాన్యం ఇస్తున్నారని,  తమ జిల్లా కేంద్రంలో కూడా ముదిరాజ్ సంఘం భవనానికి స్థలం కేటాయిస్తామని మంత్రి సబిత చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు కె. కేశవరావు, బండ ప్రకాశ్‌‌, డాక్టర్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.

For More News..

తమ్మీ..! పార్టీ మారకుండ్రి.. అనుచరులకు ఫోన్లు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

మగాళ్లకూ ‘ఫెర్టిలిటీ సెంటర్లు’.. మారిన లైఫ్‌స్టైలే కారణం

ఎక్కడోళ్లకు అక్కడ్నే టీకా.. పనిచేసే చోటే వేయాలని నిర్ణయం