
మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు అసైన్డ్ భూములు కబ్జా చేశారంటూ.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలకు చెందిన 8మంది రైతులు సీఎంకు ఇవాళ లెటర్ రాశారు. చాకలి లింగయ్య, బిచ్చవ్వ, కృష్ణ, నాగులు, పరుశురాంతో పాటు.. ఎరుకల దుర్గయ్య, ఎల్లయ్య, రాములు.. మంత్రిపై సీఎంకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబాలకు 1994లో ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పారు.
కొన్ని నెలలుగా మంత్రి ఈటల, ఆయన అనుచరులు అల్లి సుదర్శన్, ఎంజాల సుధాకర్ రెడ్డి తమను భయబ్రాంతులకు గురిచేశారని లేఖలో చెప్పారు రైతులు. ప్రభుత్వం అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంటోందని 2 గ్రామాల్లో తమతో పాటు... వందమంది రైతుల నుంచి వంద ఎకరాల భూ సర్టిఫికెట్లను గుంజుకున్నారని ఆరోపించారు. ఆ భూముల్లో పౌల్ట్రీ పరిశ్రమ కోసం షెడ్ల నిర్మాణం చేస్తున్నారని లేఖలో తెలిపారు రైతులు. దీనిపై ప్రశ్నించిన మరికొందరు రైతుల భూములను కబ్జా చేసి.. దారి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మంత్రి ఈటల ఆయన అనుచరుల నుంచి తమ భూములను తిరిగి ఇప్పించాలని ముఖ్యమంత్రిని కోరారు రైతులు.
రైతుల ఫిర్యాదుపై స్పందించారు సీఎం కేసీఆర్. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డిజి పూర్ణచందర్ రావుని సిఎం ఆదేశించారు. భూ ఆక్రమణలపై వెంటనే ప్రాథమిక నివేదికను అందించి.. ఆ తర్వాత సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలన్నారు సిఎం కేసీఆర్.