భగీరథకు నిధులివ్వండి..కేంద్రాన్నికోరిన మంత్రి ఎర్రబెల్లి

భగీరథకు నిధులివ్వండి..కేంద్రాన్నికోరిన మంత్రి ఎర్రబెల్లి

న్యూఢిల్లీ, వెలుగు:మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను ఇదివరకే సమర్పించామని ఆయన తెలిపారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల పంచాయితీ రాజ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మిషన్​భగీరథను ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ ను చేపట్టిందన్నారు. దీనిని 2024 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం, మిషన్ భగీరథ పథకం ఒక్కటేనని, అందువల్ల కేంద్రం తమకు నిధులు కేటాయించాలన్నారు. ఇందుకోసం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్‌ కు వినతిపత్రం ఇచ్చామన్నారు. మిషన్ భగీరథకు రూ.40,028 కోట్లు అవుతుందని, దాంట్లో 80 శాతం నిధులను నాబార్డు నుంచి రుణంగా తీసుకున్నట్లు చెప్పారు. మిగిలిన 20 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించిందన్నారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో భేటీ

జల్ జీవన్ మిషన్ సమావేశం తర్వాత  కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండా ప్రకాశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, పెన్షన్ పథకాలకు భారీగా నిధులు కేటాయించాలని కోరినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 680 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, దీనిపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పినట్లు వివరించారు