దళితబంధు కమీషన్లపై కేసీఆర్ హెచ్చరిక నిజమే: ఎర్రబెల్లి

దళితబంధు కమీషన్లపై కేసీఆర్ హెచ్చరిక నిజమే: ఎర్రబెల్లి
  • అనుచరులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యతన్నరు: ఎర్రబెల్లి

యాదగిరిగుట్ట, వెలుగు: దళితబంధు కమీషన్లపై ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ హెచ్చరించిన మాట నిజమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ‘‘దళితబంధు లబ్ధిదారుల నుంచి తమ అనుచరులు కమీషన్లు తీసుకున్నా ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు. అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతే తప్ప నేరుగా ఎమ్మెల్యేలే కమీషన్లు తీసుకుంటున్నారని, ఆ చిట్టా తన దగ్గర ఉందని ఎమ్మెల్యేలపై కేసీఆర్ సీరియస్ అయినట్లు మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు” అని తెలిపారు.

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి శనివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఎర్రబెల్లి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటున్నదని తెలిపారు. గోదాముల్లో స్టాక్ ఉండడం వల్ల వడ్ల కొనుగోలు కాస్త ఆలస్యమవుతోందని, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని, రైతులు అధైర్యపడొద్దని చెప్పారు.