ఎస్‌బీఐ తర్వాత స్త్రీ నిధితోనే ఎక్కువ లోన్లు

ఎస్‌బీఐ తర్వాత స్త్రీ నిధితోనే ఎక్కువ లోన్లు

జనరల్ బాడీ మీటింగ్‌లో మంత్రి ఎర్రబెల్లి 
హైదరాబాద్, వెలుగు: స్త్రీ నిధి ద్వారా ఇప్పటివరకు 3 ల‌క్షల 97 వేల‌ మహిళా సంఘాలలోని 26 ల‌క్షల 92 వేల మంది సభ్యులకు రూ.14 ,339 కోట్లు రుణంగా ఇచ్చామని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3 వేల‌ కోట్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా తరువాత అంత ఎక్కువ మొత్తంలో లోన్లు ఇస్తున్నది స్త్రీ నిధి మాత్రమేనని అన్నారు. రాజేంద్రనగర్‌‌లోని జయశంకర్‌‌ యూనివర్సిటీలో బుధవారం జరిగిన సంస్థ 9వ జనరల్ బాడీ మీటింగ్‌లో యాన్యువల్ రిపోర్టును విడుదల చేశారు. పదేండ్ల కింద రూ.32 కోట్లతో ప్రారంభమైన ఈ సంస్థ విలువ ప్రస్తుతం రూ.5,300 కోట్లకు చేరిందని ఎర్రబెల్లి అన్నారు. అభయ హస్తం నిధులను తిరిగి ఇచ్చేస్తామని, వాళ్లకు పెన్షన్‌ అందిస్తామని తెలిపారు. స్త్రీ నిధి కమిటీ కాలపరిమితిని రెండేండ్లకు పెంచేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. సంస్థకు సొంత బిల్డింగ్‌ నిర్మించే విషయాన్ని సీఎంతో చర్చిస్తానని తెలిపారు. పలువురు ఉద్యోగులు, అధికారులకు మంత్రి అవార్డులు అందించి సన్మానించారు. 

48 గంటల్లోనే రుణాలు
48 గంటల్లోనే  మహిళా సంఘాలకు రుణాలు అందజేస్తున్నామని స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి చెప్పారు. స్త్రీ నిధి వంటి సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఇతర రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని, పలు రాష్ట్రాలు ఇప్పటికే స్టార్ట్‌ చేశాయని అన్నారు. సంస్థ తరఫున రాష్ట్ర సహాయ నిధికి రూ.50 కోట్ల చెక్కును మంత్రి ఎర్రబెల్లికి అందజేశారు.