కాంగ్రెస్ మద్దతిస్తున్న వారిని గెలిపిస్తేనే వేగంగా అభివృద్ధి: మంత్రి వివేక్

కాంగ్రెస్ మద్దతిస్తున్న వారిని గెలిపిస్తేనే వేగంగా అభివృద్ధి: మంత్రి వివేక్
  • గత పాలకులు పంచాయతీలను విస్మరించారు: మంత్రి వివేక్​ వెంకటస్వామి
  • కేసీఆర్​ చేసిన అప్పులకు ప్రతి నెలా 5 వేల కోట్ల మిత్తి కడ్తున్నం
  • జనవరిలో ఒక్కో సెగ్మెంట్‌‌కు 3,500 చొప్పున ఇండ్లు
  • చెన్నూరు, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లో మంత్రి ప్రచారం

కోల్​బెల్ట్/ జైపూర్, వెలుగు:  కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్​ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, భీమారం, జైపూర్​, మందమర్రి మండలాల పరిధిలోని పంచాయతీల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున నిలబెట్టిన వారిని గెలిపిస్తే సీఎం రేవంత్​రెడ్డి వద్దకు వెళ్లి గ్రామాల అభివృద్ధికి ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, జనవరిలో ఒక్కో నియోజకవర్గానికి మరో 3,500 చొప్పున ఇండ్లు మంజూరవుతాయని చెప్పారు. బీఆర్​ఎస్​ పాలనలో ఎవరికీ డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు అందలేదని, రేషన్​కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఈ నెల 20 తర్వాత క్లారిటీ వస్తుందన్నారు.

ప్రతి నెలా 5 వేల కోట్ల మిత్తి కడ్తున్నం 

బీఆర్​ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదని, కమీషన్ల కోసం రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మంత్రి వివేక్ మండిపడ్డారు. కేసీఆర్​ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేస్తే, దానిపై ప్రభుత్వం ప్రతినెలా రూ.5 వేల కోట్లు మిత్తిగా కడుతున్నదన్నారు. బీఆర్ఎస్​పాలన అవినీతిమయమని, కేసీఆర్, కేటీఆర్ సొంత ఆస్తులను పెంచుకున్నారని ఆరోపించారు. మిషన్​ భగీరథ పేరిట రూ.60 వేల కోట్లు దోచుకున్నారని, ప్రజలకు చుక్కనీరు ఇవ్వలేదన్నారు. ఆర్థిక పరిస్థితి బాలేకున్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, ఆరు గ్యారంటీల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మహిళలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలిచ్చామని, పెట్రోల్​ బంకులు మంజూరు చేశామని చెప్పారు.

రూ.200 కోట్లతో అభివృద్ధి 

చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం సర్కార్​రూ.200 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. రెండేండ్లలో విద్య, వైద్యం కోసం ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. చెన్నూరు మండలం సోమనపల్లిలో రూ.200 కోట్లతో యంగ్​ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ను నిర్మిస్తున్నామన్నారు. భీమారంలో మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హాస్పిటల్ నిర్మించి .. అంబులెన్స్​ఏర్పాటు చేశామన్నారు. కాకా వెంకట స్వామి కుటుంబం ఎల్లప్పుడు ప్రజలకు సేవలు చేస్తున్నదని, అధికారంలో ఉన్నా లేకున్నా విశాక ట్రస్ట్ ద్వారా ప్రజల అవసరాలు తీరుస్తున్నామన్నారు. కాంగ్రెస్​బలపరిచిన సర్పంచ్​ అభ్యర్థులందరిని గెలిపిస్తే గ్రామాల్లో రూ.కోటి వరకు ఫండ్స్​ మంజూరు చేస్తామని, అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 

జైపూర్​ పవర్​ ప్లాంట్​లో స్థానికులకే ఉద్యోగావకాశాలు 

కాకా వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు జైపూర్ లో 1200 మెగావాట్ల​ సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​ ఏర్పాటుకు కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. మరో 800 మెగావాట్ల మూడో ప్లాంటుకు వచ్చేనెలలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఇందులో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామన్నారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులు తీసుకొచ్చేందుకు సర్కార్​చర్యలు తీసుకుంటున్నదని, చెన్నూరు నియోజకవర్గానికి ఒక గని వస్తుందన్నారు. చెన్నూర్​లో ఏటీసీ సెంటర్​ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.