వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం హనుమకొండ పోలీసు పరేడ్​గ్రౌండ్స్ లో పోలీసులు, ఉద్యోగులు, స్టూడెంట్స్​నిర్వహించిన ఫ్రీడమ్​రన్ ను మంత్రి ప్రారంభించారు. హనుమకొండ పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి జేఎన్ఎస్​గ్రౌండ్​వరకు ఫ్రీడమ్​రన్ కొనసాగింది.  వరంగల్, హనుమకొండ సిటీలతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫ్రీడం రన్​లు, బైక్​ర్యాలీలు, జెండా ప్రదర్శనలు జరిగాయి. 
- వెలుగు, నెట్​వర్క్: 

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ఏటూరునాగారం, వెలుగు: ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్​ అన్నారు. శనివారం స్థానిక ఐటీడీఏ మీటింగ్​ హాలులో డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంబీఏ కోర్సులు పూర్తిచేసిన గిరిజన నిరుద్యోగ యువతకు జాకారం, వరంగల్, కాటరంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లలో నిర్వహించనున్న ఫౌండేషన్ కోర్సులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు పీవో యువతతో మాట్లాడారు. ఆసక్తిగల గిరిజన నిరుద్యోగ యువత తమ విద్యార్హత సర్టిఫికెట్స్(జిరాక్స్), బయోడేటాను ఐటీడీఏలో గానీ, ఆన్​లైన్లో  గానీ  అప్లై చేసుకోవచ్చని తెలిపారు. 

కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి 

ములుగు, వెలుగు: యువత కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ములుగులో తిరంగా ర్యాలీలో పాల్గొన్న అనంతరం జాకారం లోని యూత్ ట్రైనింగ్ సెంటర్​లో కలెక్టర్ ఎస్​.క్రిష్ణ ఆదిత్య అధ్యక్షతన గ్రూప్ 1, 2, పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 

ఈసెట్​ ర్యాంకర్ కు సన్మానం 

తొర్రూరు, వెలుగు: ఇటీవల ఏపీ ఈసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్​, తెలంగాణ సెకండ్​ర్యాంక్​సాధించిన స్టూడెంట్ ​నాయకుల ఉపేందర్ ను బీజేపీ లీడర్లు సన్మానించారు. తొర్రూర్​ మండలం వెలికట్టె గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్​చార్జి పెదగాని సోమయ్య, రాష్ట్ర వేజ్ బోర్డు చైర్మన్ సామ వెంకట్ రెడ్డి సంయుక్తంగా మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన ఉపేందర్ కష్టపడి చదువుకుని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం అభినందనీయ మన్నారు. 

వీఆర్ఏల అర్ధనగ్న ప్రదర్శన 

కమలాపూర్, వెలుగు: సమస్యల సాధన కోసం వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక దీక్ష శనివారం 20వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా శనివారం వీఆర్ఏలు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ డిమాండ్లు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు కొడేపాక విజయలక్ష్మీ, మండలాధ్యక్షులు సతీశ్, సారయ్య, సంతోష్, వెంకటేశ్, కుమార్ పాల్గొన్నారు. 

రేపట్నుంచి జిల్లాలో బండి పాదయాత్ర
జనగామ, వెలుగు: బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం ఉదయం జనగామ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ మేరకు పార్టీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర కొనసాగనున్న రూట్​ను శనివారం పరిశీలించారు. బండి సంగ్రామ యాత్రను విజవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా యాత్ర ఇన్​చార్జిలను నియమించారు. ఈనెల15న గుండాల మండలంలో మొదలయ్యే పాదయాత్ర 22న ముగియనుంది.

లోక్​ అదాలత్ లో  7,937 కేసుల పరిష్కారం

వరంగల్ లీగల్, వెలుగు:  ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా శనివారం 7,937 పెండింగ్ కేసులు పరిష్కరించినట్లు వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్  రాధాదేవి తెలిపారు. శనివారం వరంగల్ న్యాయ సేవా సంస్థ భవన్ లో జాతీయ లోక్​ అదాలత్ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కోర్టులో సివిల్, క్రిమినల్, ప్రీలిటిగేషన్ కేసులు 83, హనుమకొండ జిల్లా కోర్టులో 3,853 కేసులు, జనగామ జిల్లా కోర్టులో 1,088, మహబూబాబాద్ జిల్లా కోర్టులో 492, ములుగు కోర్టులో 24, వరంగల్ జిల్లా కోర్టులో 2,397 పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన జడ్జీలు, న్యాయ అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులు, ఇతర అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవీ మహేశ్​నాథ్ , వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్  ఆనంద్ మోహన్ పాల్గొన్నారు.

పేదల భూములు కొనే భూస్వాములకు శిక్ష తప్పదు

ఏటూరునాగారం, వెలుగు: ఆదివాసీల పోడు భూములు, ఆనాడు తాము పంచిన భూములను కొనే రాజకీయ నాయకులు, భూస్వాములకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టు ఏటూరునాగారం, మహదేవపూర్​ ఏరియా కార్యదర్శి సబిత హెచ్చరించారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీల పట్టా భూములను కొందరు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంటున్నారని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పలిమెల మండలానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఆదివాసీలు భూములను పట్టాలు చేసుకుంటున్నారని, ఆ భూములను తిరిగి వెంటనే రైతులకు అప్పగించాలని హెచ్చరించారు.

డాక్టర్ పూర్ణిమను సస్పెండ్​ చేయాలి

నర్సంపేట, వెలుగు : డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు చనిపోవడానికి కారణమైన డాక్టర్ పూర్ణిమతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా నాయకుడు వీరేశ్​ డిమాండ్​ చేశారు. బాధితురాలి కుటుంబసభ్యులతో కలిసి హాస్పిటల్ సూపరిండెంట్​గోపాల్​కు శనివారం వినతిపత్రమిచ్చారు. 

డాక్టర్ నవతపై పోలీసులకు కంప్లైంట్​

కులం పేరుతో దూషించి చెప్పు చూపించిన డాక్టర్ నవతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్​ చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. కడుపులో శిశువు చనిపోయిన తమ కూతురుకు పాలు రాకుండా టాబ్లెట్స్​ఇవ్వాలని పల్లవి తల్లిదండ్రులు శనివారం డ్యూటీ డాక్టర్ నవతను కోరారు. ఈ విషయమై డాక్టర్​ చెప్పు చూపిస్తూ కొడతా అని వార్నింగ్ ​ఇచ్చిందని పల్లవి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్​ ఇచ్చారు. 

ప్రోగ్రాం కోసం రైతుల పొట్ట కొట్టిండ్రు..

శాయంపేట, వెలుగు:  ఆజాదీకా అమృత్‌‌‌‌‌‌‌‌ మహోత్సవాల సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే వేడుకల కోసం శనివారం శాయంపేట పోలీసులు కూరగాయలు అమ్మే రైతుల పొట్ట కొట్టిండ్రు. ప్రతి శనివారం ఇక్కడ జరిగే వారంతపు సంతలో రైతులు కూరగాయలు, ఆకుకూరలు అమ్ముతుంటారు. ఉదయం 10 గంటల తర్వాత మార్కెట్‌‌‌‌‌‌‌‌ ఖాళీ అవుతుంది. అయితే జడ్పీ ఛైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ గండ్ర జ్యోతి పాల్గొనే ప్రొగ్రామ్‌‌‌‌‌‌‌‌ కోసం శాయంపేట చౌరస్తాలో కూరగాయలు అమ్మే రైతులను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. కూరగాయల సంచులను ఈడ్చి పడేశారు. 

బీజేపీ దీక్ష భగ్నం చేసిన పోలీసులు 

వరంగల్​ సిటీ, వెలుగు: గ్రేటర్​ వరంగల్​ సిటీ అభివృద్ధిపై పాలకపక్షం వైఖరిని నిరసిస్తూ శనివారం వరంగల్​లోని సాకరాశి కుంటలో బీజేపీ లీడర్లు దీక్ష చేపట్టారు. ఆ దీక్షను మిల్స్​కాలనీ పోలీసులు భగ్నం చేసి లీడర్లను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. బీజేపీ తూర్పు నియోజకవర్గ ఇన్​చార్జి కుసుమ సతీశ్ ​మాట్లాడుతూ వరంగల్​తూర్పులో అభివృద్ధి లేకపోవడంతో బీజేపీ చేస్తున్న దీక్షలను పోలీసులు అడ్డుకోవడం సరికాన్నారు. కార్యక్రమంలో రత్నం సతీశ్​షా, హరిశంకర్​, రాజేందర్​, రవీందర్​, రాజు, ప్రభాకర్​ తదితరులు  ఉన్నారు. 

పంచాయతీ సెక్రటరీపై కారోబార్ దాడి..స్టేషన్​లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు 

ధర్మసాగర్, వెలుగు: ధర్మసాగర్ మండలం దేవునూరు పంచాయతీ సెక్రటరీపై గ్రామ కారోబార్ జావిద్ మరికొంతమంది కలసి పంచాయతీ ఆఫీసులో శనివారం దాడి చేశారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఆరు నెలల నుంచి సెక్రటరీ, జాన్ పాల్ కారోబార్ మధ్య బిల్లులు వసూలు చేసే విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. సెక్రటరీ నిజాయతీతో పనిచేయటం వలనే సర్పంచ్ సహకారంతోనే కారోబార్, మరికొందరు కలిసి సెక్రటరీపై దాడి చేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఘటనపై ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే.. 

రఘునాథపల్లి, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో , రాష్ట్రంలో  ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని జనగామ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఆజాదీ కా గౌరవ్ యాత్రలో భాగంలో శనివారం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్​ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన  హామీలను గాలికొదిలేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. 
ఆత్మకూరు, వెలుగు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాది కా గౌరవ్ యాత్ర చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఉత్తర తెలంగాణ జిల్లాల కోఆర్డినేటర్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు. 

పూజలు చేస్తే శని పోతుందని..స్నానానికి వెళ్లి బావిలో పడి ఒకరు మృతి 

నెక్కొండ,వెలుగు: పూజలు చేస్తే శని పోతుందని ఓ పురోహితుడు చెబితే స్నానానికి వెళ్లి బావిలో జారిపడి ఓ యువకుడు శనివారం చనిపోయాడు. ఎస్సై పర్హీన్​ వివరాల ప్రకారం... నెక్కొండ మండలం దీక్షకుంటకు చెందిన కాసుల సతీశ్​(35) తండ్రి సారయ్య 13 రోజుల కింద హార్ట్​స్ర్టోక్​తో, సోదరుడు రాము ఏడాది కింద యాక్సిడెంట్​లో చనిపోయారు. దీంతో సతీశ్ ​డిప్రెషన్​కు గురయ్యాడు. పూజలు చేస్తే శని పోతుందని ఓ పురోహితుడు చెప్పడంతో ఊరి చివరన ఉన్న బావిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. కాలుజారి అందులో పడి చనిపోయాడు. ఏడాది లోనే ముగ్గురుని కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకొంది. మృతిడికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గోపాలగిరిలో ఆయిల్​పామ్​ ఫ్యాక్టరీ 

తొర్రూరు, వెలుగు: రైతన్నల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మహబూబాబాద్​ జిల్లా తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలోని ఆయిల్ పామ్​నర్సరీలో మంత్రి దయాకర్​రావు, జిల్లా కలెక్టర్ కె. శశాంక రైతులకు మొక్కలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన  సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీలో మొక్కలను ఇవ్వడమే కాకుండా అనేక ప్రోత్సాహాకాలు అందిస్తోందన్నారు. గోపాలగిరిలో 85 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్​ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నా మన్నారు. నర్సరీ అభివృద్ధికి కృషి చేసిన ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, ఆర్డీవో రమేశ్, తహసీల్దార్​రాఘవరెడ్డి ని మంత్రి, కలెక్టర్​సన్మానించారు.

పాలకుర్తికి మారువేషంలో వచ్చా...

పాలకుర్తి, వెలుగు: తెలంగాణ లోని బంజారా(లంబాడీ)ల సంస్కృతి గొప్పదని, వారితో తమ కుటుంబానికి బాల్యం నుంచే ఆత్మీయ సంబంధాలు ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. శనివారం తీజ్​ ఉత్సవాల ముగింపులో భాగంగా పాలకుర్తి రాజీవ్​చౌరస్తాలో సంత్​ శ్రీ సేవాలాల్ మహారాజ్​ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుకు కేంద్రంతో కొట్లాడుతామన్నారు. మంత్రి మాట్లాడుతూ వర్ధన్నపేట నుంచి పాలకుర్తి నియోజకవర్గానికి మారే ముందు ఇక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మారువేషంలో వచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాళ్లతో కొట్టిన వారు కూడా నాపై వ్యక్తిగత అభిమానంతో ఓట్లువేసి గెలిపించారన్నారు. కలెక్టర్​ కె. శివలింగయ్య, ఎంపీపీ నాగిరెడ్డి, టీఆర్ఎస్​మండల అధ్యక్షుడు పసునూరి నవీన్​, సర్పంచ్​ యాకాంతారావు, కొడకండ్ల ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ పూలమ్మ తదితరులు పాల్గొన్నారు. 

మెడికల్​ కాలేజీని అన్ని హంగులతో నిర్మించాలి

జనగామ, వెలుగు : జనగామలో అన్ని హంగులతో మెడికల్​కాలేజీ బిల్డింగ్​నిర్మించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం కాలేజీ నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎంసీహెచ్​లో ఇంజనీరింగ్​ఆఫీసర్లతో రివ్యూ చేశారు. 

గీత కార్మికుడి ఆత్మహత్య 

ఎల్కతుర్తి, వెలుగు: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన పాటి రాజు(29) అనే గీతకార్మికుడు శుక్రవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దామెర గ్రామానికి చెందిన పాటి రాజు మూడేండ్ల కింద తాటి చెట్టు పై జారి పడటంతో తలకు గాయాలయ్యాయి. దీంతో మానసిక పరిస్థితి బాగాలేకపోవడంతోపాటు అనారోగ్య పరిస్థితులతో శుక్రవారం సాయంత్రం ఓ రైతు పొలం వద్ద పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేశ్ తెలిపారు.

నీటి గుంతలో పడి బాలుడి మృతి

ఎంజీఎం, వెలుగు: ఆడుకుంటూ వెళ్లి ఓ బాలుడు నీటి గుంతలో మునిగి శవమై తేలాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ మట్వాడా పీఎస్​ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. వరంగల్ భద్రకాళి టెంపుల్​ఏరియాలో ఉండే పరిమి ఫణికిరణ్, వైశాలి దంపతుల కొడుకు హరిహరన్ శర్మ(6) శనివారం ఆడుకుంటూ నీటి గుంతలో పడ్డాడు.  తల్లిదండ్రులు చిన్నారిని గమనించలేదు. ఎంతకూ తమ కొడుకు కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. చివరకు పోలీసులకు సమాచారమివ్వగా వారు సమీప ప్రాంతాలను గాలించి, చివరకు నీటి గుంతలో వెతికించారు. దీంతో బాలుడి మృతదేహం లభ్యమైంది. 

బిల్డింగ్​ శ్లాబ్​ కూలి యువకుడు మృతి,ముగ్గురికి తీవ్ర గాయాలు

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్​ నగరంలో శిథిల భవనాలు, పాత గోడలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. శనివారం మండిబజార్​లోని ఓ పాత ఇంటి గోడను కూలుస్తున్న క్రమంలో పైకప్పు కూలి ఓ యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. రంగాశాయిపేటకు చెందిన ఎండీ జహంగీర్(35) తో పాటు సుందరయ్య నగర్​కు చెందిన పల్లపు మల్లేశ్​, మహబూబాబాద్​కు చెందిన ఓర్సు మల్లేశ్​ శనివారం మండి బజార్​లో ఓ శిథిల భవనాన్ని కూల్చేందుకు పనికి వెళ్లారు. ఇంటిని కూలుస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో జహంగీర్ తలకు తీవ్ర గాయాలై స్పాట్​లోనే చనిపోయాడు. పల్లపు మహేశ్​, ఒర్సు మల్లేశ్​, ఇంటి యజమాని షకీల్​ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వరంగల్​ఎంజీఎంకు తరలించారు.