వారంలో రెగ్యులర్ చేస్తం.. కానీ మీడియాతో చెప్పను!

వారంలో రెగ్యులర్ చేస్తం.. కానీ మీడియాతో చెప్పను!

హైదరాబాద్, వెలుగు: “సీఎం కేసీఆర్ తో మాట్లాడి వారంలో రెగ్యులర్ చేస్తం.. సమ్మె విరమించండి” అని జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్)లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. ఇదే విషయాన్ని మీడియాతో చెప్పాలని జేపీఎస్​లు కోరగా.. తాను చెప్పనని మంత్రి అన్నట్లు తెలిసింది. ఆదివారం హైదరాబాద్ లో 20 మంది  జేపీఎస్​లతో మంత్రి చర్చలు జరిపారు. రెగ్యులర్​ చేస్తూ జీవో ఇస్తేనే సమ్మె విరమిస్తామని జేపీఎస్​లు చెప్పారు.  వాళ్ల  డిమాండ్లకు మంత్రి అంగీకరించకపోవటంతో చర్చలు విఫలమయ్యాయి.   దీంతో సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నామని జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చెప్పారు. 

రికార్డులు అప్పగించాలని ఆదేశాలు..  

సమ్మె విరమించాలని జేపీఎస్ లను డీపీవోలు బెదిరిస్తున్నారు. లేదంటే జాబ్​లో నుంచి తీసేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే డీపీవోలు తమను భయపెడుతున్నారని సెక్రటరీలు చెబుతున్నారు. సెక్రటరీల సంఘాల జిల్లా అధ్యక్షులకు డీపీవోలు ఫోన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా సెక్రటరీలంతా ఐక్యంగా ఉండటంతో చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గ్రామ పంచాయతీల రికార్డులను తాము నియమించిన ఇన్ చార్జ్ లకు అప్పగించాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలు జిల్లాల్లో డీపీవోలు సర్క్యులర్లు ఇచ్చారు.