81 శాతం మందికి వైరస్ సోకినట్టు కూడా తెలియదు

81 శాతం మందికి వైరస్ సోకినట్టు కూడా తెలియదు

కామారెడ్డి: క‌రోనా వైర‌స్ సోకిన వారిలో 81 శాతం మందికి ఈ వైరస్ సోకినట్టు కూడా తెలియదని, వారిలో వైర‌స్ ల‌క్ష‌ణాలు కూడా క‌న‌ప‌డ‌వ‌ని మంత్రి ఈట‌ల రాజేం‌ద‌ర్ అన్నారు. వైరస్ బారిన పడిన వారికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలకు మించదని ఆయ‌న చెప్పారు. ఆదివారం కామారెడ్డి జిల్లాలో ఎంపీ బీబీ పాటిల్ ప్రజలకు అందించే కరోనా హోమియో ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను ఆవిష్కరించారు మంత్రి ఈటెల. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కరోనా వైరస్ కు సీజనల్ వ్యాధులు కూడా తోడవుతున్నాయని అన్నారు. జిల్లాల్లో సమస్యలు తెలుసుకోవడానికి సమీక్షలు చేపడుతున్నామని, ప్రపంచంలో భగవంతుని తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకుంది వైద్యుడు మాత్రమే అని మంత్రి చెప్పారు. కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమంతా అప్రమత్తమైందని, కరోనా ప్రభావం ఎలా ఉంటుందో డబ్ల్యూ హెచ్ ఓ, ఐసీఎం ఆర్ కు కూడా తెలియలేదని అన్నారు.

ర్యాపిడ్ టెస్టులు చేయడంలో ఆలస్యం అయిందని, ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచామని మంత్రి ఈటల వెల్లడించారు. లక్షణాలు లేని వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, హోం ఐసోలేషన్ పంపే ముందు ఇంటిలో ఉన్న వారి వివరాలు పూర్తిగా తనిఖీ చేయాలని ఆదేశించామని చెప్పారు. లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని గాంధీ లేదా నిజామాబాద్ ఆస్పత్రికి పంపించాలని, అనస్థీషియా డాక్టర్లు ఎవరైనా ఉంటే వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరం ఉన్న చోట ఆక్సిజన్, వెంటిలేటర్ వసతి కల్పిస్తామని చెప్పారు.

‘కంటైన్మెంట్ అనే పదానికి అర్థం తెలిపిన రాష్ట్రం తెలంగాణ, కరోనాకు ఎవ్వరూ అతీతులు కాదు.. అందరికి కరోనా వైరస్ సోకుతోందని, వైద్యులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని’ ఈట‌ల చెప్పారు. 31 తేదీ లోపు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందించే ఏర్పాటు చేస్తామని అన్నారు. భయపడే ప్రజలకు భరోసా కల్పించడం అందరి బాధ్యత అని, అలా చేయకుండా కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇది మంచిది కాదని, ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న ఈ సమస్యను ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ చెబుతున్నారని చెప్పారు. ప్ర‌తిప‌క్షాలు బాధ్య‌త లేకుండా మాట్లాడ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

ఇవాళ చనిపోయిన వ్యక్తిని, కుటుంబ సభ్యులు ముట్టుకునే పరిస్థితి లేదు కానీ వైద్యులు, మున్సిపల్ సిబ్బంది ముట్టుకుని అంత్యక్రియలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యులు పని చేస్తున్నా వారిని అభినందించాల్సినది పోయి హేళన చేస్తూ మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, జిల్లా వైద్యులు మంచి సేవలందించి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని మంత్రి ఈటల అన్నారు.