కరోనా ట్రీట్‌‌మెంట్‌‌ ఇక జిల్లాల్లోనూ

కరోనా ట్రీట్‌‌మెంట్‌‌ ఇక జిల్లాల్లోనూ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున అందరినీ హైదరాబాద్‌‌ తీసుకొచ్చి ట్రీట్​మెంట్​ అందించడం సాధ్యం కాదని, జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్‌‌లోనే కరోనా పేషెంట్లను ఐసోలేట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను హెల్త్​ మినిస్టర్​ ఈటల రాజేందర్​ ఆదేశించారు. ప్రైమరీ హెల్త్​ సెంటర్స్​ స్థాయిలోనే జలుబు, దగ్గు  లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ట్రీట్​మెంట్​ అందించాలని సూచించారు. వృ ద్ధులు, ఇతర జబ్బులతో బాధపడేవారికి కరోనా సోకితే మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. అలాంటివాళ్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని సెక్రటేరియట్‌‌లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లాక్‌‌డౌన్  సడలింపుల తర్వాత కరోనా కేసులు పెరుగుతున్నాయని, అవసరం లేకుండా ప్రజలు బయటకు రావొద్దని  విజ్ఞప్తి చేశారు.

పాజిటివ్​ వచ్చినా లక్షణాలు లేకుంటే ఇంట్లోనే

వైరస్ వ్యాప్తి, నియంత్రణ పట్ల ఎంత ప్రచారం చేసినా జనంలో ఆందోళన మాత్రం తగ్గడం లేదని ఈటల అన్నారు. ఈ భయం వల్ల హోమ్‌‌ ఐసోలేషన్‌‌, హోం క్వారంటైన్‌‌లో ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌‌ జియాగూడలో ఇలాంటి ఘటన జరిగిందని,  ఓ కుటుంబంలో ముగ్గురికి వైరస్ సోకిందని, లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే ఐసోలేట్ చేశామని చెప్పారు. ఇంటి పక్కనవాళ్లు, కాలనీవాళ్లు ఇబ్బంది పెట్టడంతో వాళ్లు హాస్పిటల్‌‌కు రావాల్సి వచ్చిందని చెప్పారు. వైరస్ సోకిన వాళ్లందరినీ హాస్పిటల్స్‌‌కు తరలిస్తే దవాఖాన్లలో పేషెంట్ల సంఖ్య పెరిగి డాక్టర్లు, స్టాఫ్​పై ఒత్తిడి పెరుగుతుందన్నారు. అందువల్ల పాజిటివ్ వచ్చినప్పటికీ వైరస్ లక్షణాలు లేని వ్యక్తులను హోమ్‌‌ ఐసోలేషన్‌‌లోనే ఉంచాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. మరణాలు తగ్గించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని, భూమి మీద ఎక్కడే మందు ఉన్నా తెచ్చి ట్రీట్​మెంట్​ అందిస్తామన్నారు.

తెలంగాణలో 137 కు చేరిన కరోనా మృతులు