కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి : మంత్రి వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
  • బీఆర్​ఎస్​ ముఖ్య నాయకులతోపాటు 500 మంది కాంగ్రెస్​లో చేరిక

కోల్​బెల్ట్​/చెన్నూరు, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్​వెంకటస్వామి అన్నారు. శుక్రవారం రాత్రి చెన్నూరులోని క్యాంప్​ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూరు బీఆర్ఎస్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, మాజీ సర్పంచ్ సాదనబోయిన కృష్ణ, 16వ వార్డ్ మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేశ్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు నెన్నెల భీమయ్యతో సహా 500 మంది బీఆర్ఎస్​నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు.    

బీఆర్ఎస్​ హయాంలో అప్పుల కుప్పగా మార్చారు

బీఆర్ఎస్ ​హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మంత్రి వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ  సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్​ పదేండ్ల పాలనలో ఒక్క డబుల్ ​బెడ్​రూమ్​ ఇల్లు, కొత్త రేషన్​కార్డు ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే స్థోమత లేని వారికి పార్టీ శ్రేణులు సహాయం చేయాలని సూచించారు.

చెన్నూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా

చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. ఇప్పటికే రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, మరో రూ.400 కోట్ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో రూ.100 కోట్ల టీయూడీఐఎఫ్​ ఫండ్స్​ మంజూరు చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయాలని సూచించారు. 

 జిల్లాలో సెప్టెంబర్ వరకు సరిపోయే యూరియా అందుబాటులో ఉందన్నారు. రామగుండంలో మూతపడ్డ ఎరువుల కార్మాగారాన్ని రీఓపెన్ చేయించేందుకు తాను పెద్దపల్లి ఎంపీగా అప్పటి ప్రధాని మన్మోహన్​సింగ్​తో మాట్లాడి రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేయించినట్లు తెలిపారు. వెంకంపేటలో కొందరు యూరియాను బ్లాక్​ మార్కెట్​కు తరలిస్తుంటే కేసు పెట్టించానన్నారు. నియోజకవర్గంలో దందాలు, మాఫీయాను సహించబోనని హెచ్చరించారు.