కేసీఆర్ పుట్టిన గడ్డపై నేనూ పుట్టడం గర్వంగా ఉంది

కేసీఆర్ పుట్టిన గడ్డపై నేనూ పుట్టడం గర్వంగా ఉంది
  • సీఎం భారీ కటౌట్​కు గంగుల పాలాభిషేకం
  • కేసీఆర్ బర్త్​ డే బీసీలకు పండుగ రోజన్న మంత్రి 
  • తెలంగాణలో పుట్టడం ప్రజల అదృష్టమని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఘనంగా నిర్వహించారు. 41 బీసీ సంఘాల నేతలు, పెద్ద సంఖ్యలో హాజరైన టీఆర్​ఎస్ కార్యకర్తల సమక్షంలో 50 అడుగుల ఎత్తైన కేసీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. నెక్లెస్​రోడ్డు ప్రాంగణం అంతా లాంగ్ లివ్ కేసీఆర్, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీల ఆత్మగౌరవ భవనాల కోసం హైదరాబాద్ లో రూ.5000 కోట్ల విలువైన 82 ఎకరాలు ఇచ్చారని పేర్కొన్నారు. అలాంటి కేసీఆర్ పుట్టినరోజు బీసీ బిడ్డలందరికి పండుగ రోజని తెలిపారు. కేసీఆర్ లాంటి కారణజన్ముడు తెలంగాణ గడ్డపై పుట్టడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. కేసీఆర్ పుట్టిన గడ్డపై నేనూ పుట్టడం గర్వంగా ఉందన్నారు. సీఎం జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ వరం లాంటిదన్నారు. ఎంపీ బీబీపాటిల్ మాట్లాడుతూ బీసీల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారని చెప్పారు. బీసీలు ఆత్మగౌరవంతో బతకడానికి కేసీఆరే కారణ మని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్​ అన్నారు.