గవర్నర్ బీసీ వ్యతిరేకి : మంత్రి గంగుల

గవర్నర్ బీసీ వ్యతిరేకి : మంత్రి గంగుల

తెలంగాణ గవర్నర్ తమిళిసైపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. గవర్నర్ తమిళిసై బీసీ వ్యతిరేకి అని ఆరోపించారు. తమిళిసై కూడా బీజేపీ పార్టీ ఎంపిక చేస్తేనే గవర్నర్ అయ్యారని, ఆమెను తిరస్కరించలేదు కదా అని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎలా తిరస్కరించారని ప్రశ్నించారు. గవర్నర్ బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి అని ఆరోపించారు. కుర్రా సత్యనారాయణ ఎస్టీ, దాసోజు శ్రావణ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తులని చెప్పారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు మంత్రి గంగుల. జీవితాంతం తెలంగాణ కోసం పని చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

ALSO READ : ఐదున్నర కిలోల..గంజాయి పట్టివేత

కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ అప్డేట్ చేయడం అనే నిబంధనలను అమలు చేస్తోందన్నారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణకు చెందిన చాలామంది దుబాయ్, గల్ఫ్ దేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారని, వాళ్ల పేర్లు తీసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియకు తెరలేపిందని ఆరోపించారు. ఈ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాసిందన్నారు. ఒక్క పేరు తొలగించినా రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదన్నారు. ఆధార్ అప్డేట్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రజలెవరూ అధైర్య పడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.