ఐదేళ్ల కోసం గెలిపిస్తే మధ్యలోనే కత్తిపారేసి వెళ్లిపోయాడు

ఐదేళ్ల కోసం గెలిపిస్తే మధ్యలోనే కత్తిపారేసి వెళ్లిపోయాడు
  • ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ సెటైర్లు
  • మంత్రిగా రెండుసార్లు ఉండి హుజురాబాద్ ను అభివృద్ధి చేయలేని ఈటల.. బీజేపీలోకి వెళ్లి ఏం చేస్తాడు? 
  • ప్రభుత్వంలో ఉన్నప్పుడే నిధులు తేలేని ఈటల.. ఇప్పుడు గెలిచి ఎక్కడ నిధులు తెస్తాడు?
  • ఏడేళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండీ ఏమీ చేయలేనోడు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేయగలడు
  • ఇక నుంచి నేను ఈ హుజురాబాద్ బాధ్యతలు తీసుకుంటా
  • అభివృద్ధి అంటే ఎలా ఉంటదో చేసి చూపిస్తా 
  • టీఆర్ఎస్ నాయకుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ 

కరీంనగర్: ‘‘ఐదేళ్ల కోసం గెలిపిస్తే మధ్యలోనే కత్తిపారేసి వెళ్లిపోయాడు.. మంత్రిగా రెండుసార్లు ఉండి హుజురాబాద్ ను అభివృద్ధి చేయలేని ఈటల.. బీజేపీలోకి వెళ్లి ఏం చేస్తాడు? ప్రభుత్వంలో ఉన్నప్పుడే నిధులు తేలేని ఈటల.. ఇప్పుడు గెలిచి ఎక్కడ నిధులు తెస్తాడు ? ఏడేళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండీ ఏమీ చేయలేనోడు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేయగలడు ?..’’ అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ సెటైర్లతో విరుచుకుపడ్డారు. బుధవారం హుజురాబాద్ టీఆర్ఎస్ నాయకుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఏడేళ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్ కు ఒరగబెట్టిందేమీలేదన్నారు. తెలంగాణ రాకముందు ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉంది, కేసీఆర్ ఎమ్మెల్యేలందరికీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులిచ్చారు, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల మీ ఊరి అభివృద్ధి గురించి కేసీఆర్ ను ఎందుకు అడగలేదు అని ప్రశ్నించారు. 


‘‘హుజురాబాద్ లో ఎక్కడా మంచినీరు రావడం లేదు. రోడ్లు దారుణంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా దుమ్మే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి అయినా హుజురాబాద్ ఎందుకు ఇలా ఉంది? తెలంగాణ రాకముందు హుజురాబాద్ ఎలా ఉందో.. ఇప్పుడు ఇలాగే ఉంది. కరీంగనర్ లో డెయిలీ వాటర్ ఇచ్చాం. ఐటీ టవర్ తెచ్చాం. రోడ్లు డెవలప్ చేసుకున్నాం. సీఎం కేసీఆర్ ఏ ఎమ్మెల్యే అడిగినా నిధులిచ్చారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల ఎందుకు అభివృద్ధి చేయలేదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు ఊరి అభివృద్ధి కోసం ఎందుకు అడగలేదు. ఇక్కడి ఎమ్మెల్యే ఏనాడు హుజురాబాద్ అభివృద్ధి కోసం సీఎం దగ్గరకు పోలేదు. కానీ బడుగు బలహీన వర్గాల దగ్గర లాక్కున్న భూములు రెగ్యులరైజ్ చేసుకునేందుకు, తన వ్యాపారాల అభివృద్ధి కోసం సీఎం దగ్గరకి పోయేవాడు. నిన్ను పిలిచి రైతు బంధు మీ దగ్గరే మొదలు పెడుతామని” కేసీఆర్ నిన్ను పిలిచాడు. కేసీఆర్ స్వయంగా అంతటి గౌరవిస్తే నువ్వు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢీల్లీలో తాకట్టు పెట్టావు..’’ అంటూ గంగుల ధ్వజమెత్తారు.
నీకు అమిత్ షానో, నడ్డానే కండువా కప్పుతారనుకుంటే ఎవరికీ తెలియని ధర్మేంద్ర ప్రదాన్ తో కండువా కప్పించుకున్నాడు, దానికి బదులు ఇక్కడ బండి సంజయ్ చేతిలో కండువా వేసుకుంటే బాగుండేది, నీ వల్ల నీ గౌరవంతోపాటు.. నీవల్ల హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవం కూడా దెబ్బతింది, హుజురాబాద్ ప్రజలు నిన్ను గెలిపించినందుకు వీళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టావు, గతంలో డీకే అరుణ, బాబు మోహన్ లాంటి వాళ్లు బీజేపీ చేరినప్పుడు దొరికిన గౌరవం నీకెందుకు దక్కలేదు? నీతో వచ్చినవాళ్లకు ఢిల్లీలో చెట్ల కింద కండువా కప్పించావు. ఈ మాత్రం దానికి ప్రత్యేక విమానంలో పోవడమెందుకు ? ఏనాడైనా హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్లను తీసుకెళ్లి కేటీఆర్ ను కలిసి నిధులు అడిగావా ? ఇక నుంచి నేను ఈ హుజురాబాద్ బాధ్యతలు తీసుకుంటా. ఇది కూడా తెలంగాణలో అంతర్భాగమే. నేను నిధులు అడిగి ఇకపై ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయిస్తా.
హుజురాబాద్ అభివృద్ధిని మరిచిపోయి కేవలం తన ఆస్తుల పెంపకంపైనా ఈటల ఇంతకాలం దృష్టి పెట్టారు. సమైక్య వాదులైన శత్రువులను కొట్టేందుకు కేసీఆర్ అనే ఆయుధాన్ని, టీఆర్ఎస్ పార్టీని తయారు చేసుకున్నాం. ఈ పార్టీని కాపాడుకునే బాద్యత మనపై ఉంది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో మనల్ని పాలించిన ఇతర పార్టీలు మన అభివృద్ధిని పట్టించుకోలేదు. అందుకే టీఆర్ఎస్ ను కాపాడుకోవాలి. రాబోయే ఉప ఎన్నికలను ఇక్కడి ప్రజలు కీలకంగా చూడాలి. ఇక్కడ అభ్యర్థి ఎవరైనా... వారిని కేసీఆర్ లాగా బావించుకోండి. మీరు వేసే ఓటు కేసీఆర్ కు, ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలకు వేస్తున్నామని గుర్తుంచుకోండి. మరో మూడేళ్లు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత కూడా ఉంటుంది..’’ అని మంత్రి గంగుల పేర్కొన్నారు.

నీకు కండువా వేసిన పెట్రోలియం మంత్రి దర్మేంద్ర ప్రదాన్ ను కనీసం గ్యాస్ ధర, పెట్రోలు ధర తగ్గించమనైనా ఈటల అడిగాడా ? వెనకబడిన 56 కులాల కోసం రిజర్వేషన్లు కావాలని సీఎం గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. నీవు బీసీనని చెప్పుకుంటున్నావు కదా.. మరి ఈ విషయం అడిగావా ? అని మంత్రి గంగుల ప్రశ్నించారు.