పాఠశాలల అభివృద్ధికి డొనేషన్ చేస్తే వృథా కావు..!

పాఠశాలల అభివృద్ధికి డొనేషన్ చేస్తే వృథా కావు..!

కరీంనగర్: బ‌డి కూడా గుడి లాంటిదే అన్నారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్. బుధ‌వారం ఆయ‌న క‌రీంన‌గ‌ర్ లో మన ఊరు- మన బడి కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు.  ప్రతి ఊరిలో దేవాలయం, విద్యాలయం ఉంటాయని.. స్కూళ్లు కూడా దేవాలయాల్లంటివే అన్నారు.  పవిత్రంగా భావించే ఆలయాలు, విద్యాలయాలు, ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పుడో సంకల్పించారని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లాలోని ఏదైనా స్కూలును వాడుకునే విధంగా తన సోదరుని పేరిట 20 లక్షల రూపాయలు మా కుటుంబం తరపున ఇస్తాన‌ని చెప్పారు.  కోటి రూపాయలు ఎవరైనా విరాళం ఇస్తే వారు కోరిన వారి పేరును ఆ స్కూలుకు పెడతామ‌ని తెలిపారు.

10 లక్షలు ఇస్తే తరగతి గదికి పేరు పెడతామ‌న్నారు. 2 లక్షలు ఇస్తే స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలో సభ్యుడిగా నమోదు చేస్తామ‌న్నారు. పాఠశాలల అభివృద్ధికి ఇచ్చే డొనేషన్ చేస్తే వృథా కావని..ఒకప్పుడు వ్యవసాయ పనులకు, కూలీ పనులకు పిల్లలు వస్తే తమకు ఆసరాగా ఉంటుందని పేరెంట్స్ పిల్లలను మధ్యలోనే బడిమాన్పించేవారని చెప్పారు. ఇప్పుడు కూలీ చేసుకునేవాళ్లు కూడా తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని తాపత్రయపడుతున్నారన్నారు. అలాంటి పిల్లలకు కావాల్సిన మౌళిక వసతులు కల్పించేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టామ‌ని.. పేద పిల్లలు చదువుకునే సర్కారు స్కూలును ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం లక్ష్యం అన్నారు.