కేసీఆర్ నాయకత్వంలో ఏపీలో కూడా పాగా వేస్తాం

కేసీఆర్ నాయకత్వంలో  ఏపీలో కూడా పాగా వేస్తాం

కరీంనగర్: కేసీఆర్ నాయకత్వంలో  ఏపీలో కూడా పాగా వేస్తామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ లో నిర్వహంచిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన... జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో వైసీపీ నాయకులు చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టేలా కామెంట్ చేశారని అన్నారు. సజ్జల రామకృష్ణా రెడ్డి వైఎస్ కుటుంబంలో ఉడుములా చొరబడ్డారని, అన్నా చెల్లెలను విడదీశారని ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్, హరీశ్ రావు మధ్య చిచ్చు పెట్టేందుకు సజ్జల ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నుంచి హరీశ్ రావును విడదీసే దమ్ము సజ్జల రామకృష్ణా రెడ్డికి లేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఓ కుటుంబమన్న కమలాకర్... తమనెవరూ విడదీయలేరని స్పష్టం చేశారు.

ఏపీలో జగన్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని, ముందు వైసీపీ ప్రజా ప్రతినిధులు ఏపీ సమస్యలపై దృష్టి పెట్టాలని గంగుల కమలాకర్ సూచించారు. జగన్ ప్రభుత్వ విధానాలు నచ్చక అక్కడి ప్రజలు హైదరాబాద్ కు వలస వస్తున్నారని తెలిపారు. ఓ వైపు కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటుంటే... మరోవైపు ఏపీలో జగన్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు వద్దనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణకు వచ్చిన ఏపీ వాసులను తిరిగి తీసుకుపోయే దమ్ము సజ్జలకు ఉందా అంటూ సవాలు విసిరారు. తెలంగాణపై జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తే ఊరుకునేదిలేదని, మరోసారి తెలంగాణ ఉద్యమ రుచి చూపిస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందని గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు.