బీఆర్‌‌జీఎఫ్ మరో ఐదేండ్లు పెంచండి : మంత్రి హరీశ్‌‌రావు

బీఆర్‌‌జీఎఫ్ మరో ఐదేండ్లు పెంచండి : మంత్రి హరీశ్‌‌రావు

కేంద్రానికి మంత్రి హరీశ్‌‌రావు విజ్ఞప్తి 
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి
భగీరథకు రూ. 2,350 కోట్లను ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: మూడేండ్లుగా పెండింగ్​లో ఉన్న వెనకబడిన జిల్లాల అభివృద్ధి పనులకు నిధుల (బీఆర్ జీఎఫ్) ను విడుదల చేయాలని కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌‌రావు విజ్ఞప్తి చేశారు. కేంద్రం సూచనల మేరకు యుటిలైజేషన్ సెర్టిఫికెట్లు కూడా సమర్పించామని తెలిపారు. విభజన చట్టం ప్రకారం పదేండ్ల పాటు బీఆర్​జీఎఫ్ ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ.. దాన్ని మరో ఐదేండ్లు పొడిగించాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో పది జిల్లాలు ఉండేవని, ఇప్పుడు 33కు పెరిగినందున హైదరాబాద్ మినహా 32 జిల్లాలకూ దీన్ని విస్తరింపజేయాలని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌‌కు ముందు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం జరిగిన మీటింగ్​లకు గైర్హాజరైన హరీశ్‌‌రావు రాష్ట్ర అంశాలను ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రోస్ ద్వారా ఆ సమావేశంలో అందజేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ‘నేషనల్ స్టేటస్’ ఇవ్వాలని కోరారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రావాల్సి రూ.2,350 కోట్లు విడుదల చేయాలన్నారు. ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులు పక్కదారి పట్టాయని, రూ. 151 కోట్లను తిరిగి రికవరీ చేయాల్సిందిగా కేంద్రం నవంబరు 12న లేఖ రాసి 15 రోజుల గడువు విధించిందని ఆ గుర్తుచేశారు. ఇలాంటి ఆంక్షలు, చర్యలు ఉపాధి చట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.

సెస్​లు, సర్​చార్జీలు పన్ను ఆదాయంలో 10 శాతం మించొద్దు

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో పొరపాటున తెలంగాణకు రావాల్సిన రూ.495 కోట్లను ఏపీకి కేటాయించిన కేంద్రం దాన్ని తిరిగి ఇప్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన ఐటీఐఆర్ ప్రతిపాదనను తిరిగి పరిశీలించాలన్నారు. పెండింగ్‌‌లో ఉన్న గిరిజన వర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ తదితరాలను పరిష్కరించాలని కోరారు. కేంద్రం సెస్‌‌లు,  సర్‌‌చార్జ్‌‌లు విధించడం పెరగడంతో రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని, రాష్ట్రాలకు పన్ను పంపిణీ 41 శాతం వాటాతో పోలిస్తే 29.7 శాతానికి తగ్గిందన్నారు. పన్ను ఆదాయంలో సెస్‌‌లు, సర్‌‌చార్జ్‌‌ల వాటా 10 శాతానికి మించకుడదన్నారు. 2021–-22 నుంచి రాష్ట్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్లు సేకరించిన ఆఫ్ -బడ్జెట్ అప్పులను రాష్ట్రం చేసిన అప్పులుగా కేంద్రం పరిగణించడం షాక్‌‌కు గురి చేసిందన్నారు. ఈ నిర్ణయాన్ని 2023-–24 నుంచి వర్తింపజేయాలన్నారు.