ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అదానీకి మద్దతిచ్చిందని వెల్లడి
ఎటువంటి ఒత్తిళ్లు లేవు: ఎల్‌ఐసీ
న్యూఢిల్లీ:
మోదీ గవర్నమెంట్ ఒత్తిళ్లతో అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడులు పెడుతోందని అమెరికన్ న్యూస్‌పేపర్ వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో, అదానీ గ్రూప్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో, ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టిందని తెలిపింది. వాషింగ్టన్ పోస్ట్‌లో వచ్చిన స్టోరీ ప్రకారం, భారత ప్రభుత్వం ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అదానీ గ్రూప్‌కు నిధులు సమకూరుస్తోంది. ఇందుకు సంబంధించి ఇంటర్నల్‌గా ఒక ప్లాన్‌ను రూపొందించింది. ముఖ్యంగా ఎల్‌ఐసీ పెట్టుబడి నిర్ణయాలు స్వతంత్రంగా కాకుండా, బయట ఒత్తిళ్లతో జరిగాయి. ఈ ఏడాది మేలో అదానీ పోర్ట్స్‌లో సుమారు రూ.4,700 కోట్లను (570 మిలియన్ డాలర్లను) పెట్టుబడిగా పెట్టింది. వాషింగ్టన్ పోస్ట్ ఈ పెట్టుబడిని ఉదాహరణగా చూపింది. ‘‘అదానీ గ్రూప్‌పై అమెరికాలో దర్యాప్తులు కొనసాగుతున్న సమయంలో ఈ పెట్టుబడి జరిగింది. కంపెనీ అప్పుల భారంతో బాధపడుతున్న సమయంలో ఎల్‌ఐసీ మద్దతుగా నిలవడం అనుమానాస్పదంగా ఉంది”అని వివరించింది. ఎల్‌ఐసీ నిర్ణయాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా ఇతర ప్రభుత్వ సంస్థలు ప్రభావం చూపించాయని భావిస్తోంది.
బోర్డు నిర్ణయంతోనే పెట్టుబడులు: ఎల్‌ఐసీ
పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను స్వతంత్రంగా, బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం, అన్నీ విశ్లేషించాకనే తీసుకుంటామని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణలను ఖండించింది. తన పెట్టుబడులు బయట ఒత్తిళ్లతో జరగలేదని, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా ఇతర సంస్థల జోక్యం లేదని తెలిపింది. కాగా, ఎల్‌ఐసీ ఈ ఏడాది మేలో అదానీ పోర్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయగా, ఈ కంపెనీకి ‘ఏఏఏ’ క్రెడిట్ రేటింగ్ ఉంది. ‘‘2014లో టాప్ 500 కంపెనీల్లో మా పెట్టుబడి విలువ రూ.1.56 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నాటికి ఇది రూ.15.6 లక్షల కోట్లకు పెరిగింది.
ఇది మా బలమైన ఫండ్ మేనేజ్‌మెంట్‌ను సూచిస్తోంది”అని ఎల్‌ఐసీ వివరించింది. ప్రస్తుతం ఈ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.41 లక్షల కోట్ల ఆస్తులను మేనేజ్ చేస్తోంది. ఇండియాలో అతిపెద్ద డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్‌గా కొనసాగుతోంది. 351 పబ్లిక్ కంపెనీల్లో, ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ డెట్‌లలో పెట్టుబడులు పెట్టింది. అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ, ఆ గ్రూప్ మొత్తం అప్పులో 2శాతం కన్నా తక్కువ ఉంది. అంతర్జాతీయంగా బ్లాక్‌రాక్, అపోలో, మిజుహో, ఎంయూఎఫ్‌జీ, డీజెడ్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా అదానీ డెట్‌లో పెట్టుబడులు పెట్టాయి.
కిందటి ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ అప్పు రూ.2.6 లక్షల కోట్లు ఉండగా, రూ.90 వేల కోట్ల ఆపరేటింగ్ లాభాన్ని సాధించింది. రూ.60 వేల కోట్ల క్యాష్ ఫ్లోస్‌ను నిర్వహిస్తోంది. ఎల్‌ఐసీకి అదానీ స్టాక్స్‌లో రూ.60 వేల కోట్ల (4శాతం) పెట్టుబడులు ఉన్నాయి. రిలయన్స్‌లో రూ.1.33 లక్షల కోట్లు (6.94శాతం), ఐటీసీలో రూ.82,800 కోట్ల (15.86శాతం) పెట్టుబడులు ఉన్నాయి.
