7 రోజుల్లో వెండి18 శాతం డౌన్.. 9 వారాల తర్వాత నష్టాల్లో బంగారం.. హైదరాబాద్లో రేట్లు ఇవే !

7 రోజుల్లో వెండి18 శాతం డౌన్.. 9 వారాల తర్వాత నష్టాల్లో బంగారం.. హైదరాబాద్లో రేట్లు ఇవే !
  • కేజీకి రూ.2 లక్షల  నుంచి రూ.1.55 లక్షలకు పడిన రేట్లు
  • ధరలు గరిష్టాలకు చేరడంతో అమ్మేస్తున్న ఇన్వెస్టర్లు
  • ఈటీఎఫ్‌‌ల నుంచి కొనసాగుతున్న ఫండ్స్‌‌ విత్‌‌డ్రా
  • ధరలు మళ్లీ పెరగొచ్చని ఎనలిస్టుల అంచనా

న్యూఢిల్లీ: దీపావళికి ముందు భారీగా పెరిగిన  వెండి ధరలు, ఆ తర్వాత నుంచి పడడం మొదలు పెట్టాయి. కేవలం 7 రోజుల్లోనే 18 శాతం తగ్గాయి. ఆన్‌‌లైన్ న్యూస్ ప్లాట్‌‌ఫామ్‌‌ గుడ్‌‌రిటర్న్స్‌‌ ప్రకారం, శనివారం (అక్టోబర్ 25) నాటికి  వెండి ధరలు సగటున  కిలోకు రూ.1.5 లక్షల వద్ద ఉన్నాయి. ఈ నెల 18న అంటే ధనత్రయోదశి సమయంలో వెండి రేట్లు  రూ.2 లక్షల వద్ద  గరిష్ట స్థాయిని టచ్ చేసిన విషయం తెలిసిందే. 

 బంగారం ధర కూడా గత 10 రోజులుగా తగ్గుతోంది. బ్లూమ్‌‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్‌‌గా  స్పాట్ గోల్డ్  ఔన్స్‌‌కి (28 గ్రాములకి) 4,113.05 డాలర్ల  వద్ద శుక్రవారం ముగిసింది. అక్టోబర్ 20న 4,381.52 డాలర్ల వద్ద  గరిష్ట స్థాయిని తాకిన గోల్డ్‌‌ ధరలు,  ఆ తర్వాత నుంచి పడుతున్నాయి.   ఈ వారంలో 3.3శాతం తగ్గాయి.   హైదరాబాద్‌‌లో 24 క్యారెట్ల గోల్డ్‌‌ ధర శనివారం రూ.1,25,600 పలుకుతోంది. 

వెండి రేటు రూ.1.70 లక్షలకు చేరుకుంది.  వెండి గత వారం ఔన్స్‌‌కి 54 డాలర్లకి చేరిన తర్వాత 6శాతం తగ్గింది. ఇండియా మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్‌‌ (ఎంసీఎక్స్‌‌) లో వెండి డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.1,47,470 వద్ద ట్రేడ్ అవుతోంది.  చెన్నై, కేరళలలో  వెండి ధర కేజీకి రూ.1.70 లక్షలు ఉండగా,  ముంబై, ఢిల్లీ,  కోల్‌‌కతా, పుణె, వడోదర, అహ్మదాబాద్‌‌లలో రూ.1.55 లక్షలు, బెంగళూరులో రూ.1.57 లక్షలు పలుకుతోంది. రవాణా ఛార్జీలు, లోకల్ ట్యాక్స్‌‌లు, సప్లయ్‌‌, డిమాండ్  బట్టి వెండి ధరలు వేర్వేరు సిటీల్లో వేర్వేరుగా ఉన్నాయి.

గత వారం రికార్డ్ లెవెల్‌కు..

భారతదేశంలో పండుగల డిమాండ్, లండన్ మార్కెట్లో సరఫరా కొరత, ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం వలన గత వారం వెండి, బంగారం ధరలు దూసుకుపోయాయి.  అక్టోబర్ 16న కేజీ వెండి ధర రూ.1,89,000 ఉండగా, అక్టోబర్ 25 నాటికి ఇది రూ.1,55,000కి దిగొచ్చింది.  అయినా, వెండి, బంగారం లాంటి విలువైన లోహాలపై పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగుతోంది. 

‘‘ ట్రంప్, పుతిన్ మధ్య మీటింగ్‌‌ వాయిదా పడింది. చైనా అధ్యక్షుడితో సమావేశంపై అనిశ్చితి ఉంది. ఈ పరిస్థితుల్లో ధరలు తగ్గితే, కొనుగోళ్లకు అవకాశం ఉంటుంది”అని మోతిలాల్‌‌ ఓస్వాల్ ఎనలిస్ట్ మానవ్ మోదీ అన్నారు. మరోవైపు  టాటా మ్యూచువల్ ఫండ్‌‌ తన సిల్వర్ ఈటీఎఫ్‌‌ ఎఫ్‌‌ఓఎఫ్‌‌ (ఫండ్స్ ఆఫ్​ ఫండ్‌‌)  స్కీమ్‌‌లో పెట్టుబడులను తిరిగి ప్రారంభించింది. అక్టోబర్ 14న తాత్కాలికంగా నిలిపిన సిప్‌‌/ఎస్‌‌టీపీ లను తిరిగి ప్రారంభించనుంది.

బంగారం పతనానికి కారణాలు..

గత 9  వారాలుగా పెరిగిన బంగారం ధరలు, ఈ వారం నష్టాల్లో ముగిశాయి.  ధరలు గరిష్ట స్థాయిలకు చేరడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు.  అమెరికాలో అంచనాలకంటే తక్కువగా వచ్చిన ద్రవ్యోల్బణం డేటా  నేపథ్యంలో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు పెరిగాయి. వడ్డీ రేట్లు తగ్గితే, బంగారం వంటి లోహాలకు డిమాండ్ పెరుగుతుంది. ట్రంప్-–షీ జిన్‌‌పింగ్ సమావేశం ద్వారా అమెరికా, -చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది.  ఉద్రిక్తతలు తగ్గితే బంగారం ధరలు పడొచ్చు.  బ్లూమ్‌‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం,  బంగారం ఆధారిత ఎక్స్చేంజ్‌‌ ట్రేడెడ్ ఫండ్స్‌‌ (ఈటీఎఫ్‌‌) ల నుంచి భారీగా ఫండ్స్  విత్‌‌డ్రా జరుగుతోంది.