సిద్దిపేట నుండి తిరుపతి, బెంగళూరుకు రైళ్లు ప్రారంభించాలి : హరీష్ రావు

సిద్దిపేట నుండి తిరుపతి, బెంగళూరుకు రైళ్లు ప్రారంభించాలి : హరీష్ రావు

సిద్దిపేట నుండి తిరుపతి, బెంగళూరుకు రైళ్లు ప్రారంభించడంతో పాటు, ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు. బుధవారం (సెప్టెంబర్ 6న) ఉమ్మడి మెదక్ జిల్లాలో రైల్వే పెండింగ్ పనుల అంశంపై సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కలిశారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. 

కొత్తగా నిర్మించిన సిద్దిపేట రైల్వే లైన్ సెప్టెంబర్ 15వ తేదీన రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇన్స్పెక్షన్ పూర్తి కాగానే  ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్ నుండి సిద్దిపేటకు పుష్ పుల్ రైల్ ను కూడా ప్రత్యేకంగా ప్రారంభించాలని కోరారు. పఠాన్ చెరు ఎదుల నాగులపల్లిలో గూడ్స్ టెర్మినల్ త్వరగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు.

* కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద కొత్త  రైల్వే స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.

* మాసాయిపేట్ రైల్వే పెండింగ్ పనులను  కూడా వేగంగా పూర్తి చేయాలని కోరారు.

* దేశ చరిత్రలోనే అత్యంత త్వరితగతిన సిద్దిపేట రైల్వే లైన్ పూర్తి అయిందంటే రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూ సేకరణ చేసి, రైల్వే శాఖకు ఇవ్వడం వల్లే సాధ్యమైందని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దేశంలో మొట్టమొదటిసారి ఒక్క కోర్టు కేసు కూడా లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగాం అని చెప్పారు. తెలంగాణలో నిర్మించనున్న ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ లో మెదక్, సిద్దిపేటను కలపాలని మంత్రి హరీశ్ రావు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ను కోరారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో ఔటర్ రింగ్ రైల్వే లైన్ ను మెదక్, సిద్దిపేట మీదుగా నిర్మించాలన్నారు.

* రూ. 250 కోట్లతో 2 వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేసి, రైల్వే శాఖకు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.315 కోట్లు నిధులు కూడా సమయానికి విడుదల చేయడం వల్ల సిద్దిపేట రైల్వే లైన్ పూర్తయిందని మంత్రి అన్నారు.

* చేగుంట మెదక్ రోడ్డులో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జీఎంను కోరారు. అన్ని విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన జీఎం అరుణ్ కుమార్ జైన్... ప్రతిపాదనలను వెంటనే రైల్వే బోర్డ్ కి పంపిస్తామన్నారు. ఈ క్రమంలో రైల్వే బోర్డుని కూడా త్వరలో కలవనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.