
కాంగ్రెస్ నాయకులకి టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి విమర్శించే హక్కు లేదని అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నాయకులు అనవసరంగా కేసీఆర్ పై మాట్లాడుతున్నారని, తెలంగాణ కంటే మరే రాష్ట్రం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు మంత్రి . బుధవారం మెదక్ లో పర్యటించిన హరీష్ రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను తిప్పి కొట్టారు.
తమ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించిందని, ఉచిత కరెంటు ఇచ్చిందన్న మంత్రి … అందుకు మద్దతు ఇవ్వని వారంటే దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల వారేనని అన్నారు. రాష్ట్రంలోని రైతులు కరోనా తో ఇబ్బందులు పడుతున్న సమయంలో రైతు రుణమాఫీ కై 1200 కోట్లు రిలీజ్ చేశామన్నారు . వ్యవసాయ శాఖ అధికారులు రైతుల అకౌంట్ లోకి ఆ డబ్బుని జమ చేస్తారని తెలిపారు. దేశ చరిత్రలో రైతులు పండించిన పూర్తి పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన అన్నారు . కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలు రైతులను నట్టేట్లో ముంచారని హరీష్ అన్నారు.