
హైదరాబాద్ : వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. మద్దతు ధర కంటే రైతుకు ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వవద్దని ఈ ఏడాది సెప్టెంబర్ 17న రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. కేంద్రం పరోక్షంగా సన్న వడ్లకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వద్దని రాష్ట్రాలకు లేఖ రాస్తే.. అదే కేంద్ర మంత్రి ఎక్కువ ధర చెల్లించాలని డిమాండ్ చేయడం రెండు నాలుకల ధోరణి కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖను మీడియాకు మంత్రి విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు మద్దతు ధర కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సన్న రకాలకు ఎక్కువ ధర ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న కిషన్ రెడ్డి.. కేంద్రం రాసిన లేఖను వెనక్కి తీసుకునేలా ప్రయత్నించాలని సూచించారు. కేంద్రం లేఖ రాష్ట్రాలకు మెడ మీద కత్తిలా ఉందని ధ్వజమెత్తారు. ఒక్క రూపాయి మద్ధతు ధర కన్నా ఎక్కువ ఇస్తే మీ రాష్ట్రం నుంచి బియ్యం కాని, వడ్లు కాని సేకరించేది లేదని ఎఫ్‌సీఐ తేల్చి చెప్పిందన్నారు.