
తెలంగాణ రాష్ట్రానికి ఐజీఎస్టీ కింద రావాల్సిన రూ. 2638 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో డిమాండ్ చేశారు. ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు ఎంసీహెచ్‌ఆర్‌డి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ సభ్యులైన ఢిల్లీ, చత్తీస్ ఘడ్, పంజాబ్, తమిళనాడు, ఒడిశా ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఐజీఎస్టీ సెటిల్మెంట్ పై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీ మొత్తంపై ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నారు. రాష్ట్రానికి ఎంత ఐజీఎస్టీ రావాల్సి ఉందన్న విషయంపై తమరే స్పష్టత ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 25 వేల 58 కోట్లు ఐజీఎస్టీ మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ జీఎస్టీ కౌన్సిల్ కు సిఫారసు చేయాలని కోరారు. తెలంగాణకు ఐజీఎస్టీ కింద రావాల్సిన రూ. 2638 కోట్లు వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
గతంలో ఈ మొత్తాన్ని 25 వేల 58 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ లో నిబంధలకు విరుద్ధంగా జమ చేశారన్న విషయాన్ని పార్లమెంట్ లో కాగ్ ఎత్తి చూపిన విషయాన్ని మంత్రి హరీశ్ రావు ఈ సమావేశంలో ప్రస్తావించారు. కాగ్ సైతం ఈ విషయంలో తప్పు పట్టింది కాబట్టి ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని ఇవ్వాలన్న సిఫారసును గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ నెల ఐదో తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ ఎజెండాలో ఉండేలా చూడాలని కోరారు.