ఈ మధ్య ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారని.. తెలంగాణలో పార్టీ పరిస్థితి పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్తకు మీడియా కూడా ప్రాధాన్యమిచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన చాన్స్‌ను చేజార్చుకున్నామని.. ఇపుడు 8 మంది ఎంపీలు ఉన్నా ప్రతిపక్ష పాత్ర ఎందుకు సమానంగా పోషించలేకపోతున్నారని, ముఠా తగాదాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు, వాటన్నిటికన్నా ఆసక్తి కలిగించిన విషయం ఏమిటంటే..‘సోషల్ మీడియాలో బీజేపీ కన్నా, ఒవైసీ సోషల్ మీడియా బలంగా ఉందని, కనీసం ఆయనను చూసైనా నేర్చుకోండి’ అని మోదీ హితబోధ చేయడమే అసలు చర్చనీయాంశం.
ఆ వార్త చూసిన ఆ పార్టీ క్యాడర్ అయినా, ప్రజలు అయినా ‘ఇంతకాలానికిగాని మోదీకి అర్థంకాలేదా’ అని ఆశ్చర్యపోయిన వారే కనిపిస్తున్నారు తప్ప, మోదీకి ఆలస్యంగా తెలిసిందని అనుకునేవారు మాత్రం ఎవరూ కనిపించడం లేదు! రెండేండ్ల క్రితమే ఇదే ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటే ఎంత బాగుండేది అని ఆ పార్టీ కిందిస్థాయి క్యాడరే చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. బండి సంజయ్‌ని అధ్యక్షుడిగా ఎందుకు తొలగించారో ఆ పార్టీ కార్యకర్తలకే అర్థం కానపుడు, అది కచ్చితంగా పార్టీ ఢిల్లీ నాయకత్వానికి తప్ప మరెవరికి అర్థం కాదుకూడా! రెండేండ్ల నుంచి తెలంగాణలో ఆ పార్టీని ‘స్లీపింగ్ మూడ్’లో ఎందుకు పెట్టారో మోదీకి తప్ప ఇంకెవరికి తెలుసు?
అదేం వ్యూహం?
పార్టీలో ముఠాలు ఉండొచ్చు. ఒకరిపై ఒకరు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చెప్పొచ్చు. సంజయ్‌ని తొలగించాలని, లేదా మరొకరిని నియమించాలని చెప్పొచ్చు. వారి మాట విని మోదీ, అమిత్ షా మార్పునిర్ణయం తీసుకొని ఉంటారని అనుకోవడం మాత్రం సాహసమే అవుతుంది! అదేదో వ్యూహాత్మకంగానే సంజయ్‌ని తొలగించి పార్టీని ‘స్లీపింగ్ మూడ్’లో పెట్టడానికే చేశారనే అనుమానాలు కాలం గడుస్తున్న కొద్దీ పెరిగాయి ! ఆ వ్యూహమే ఇవాళ తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితిని ఇలా చేసిపెట్టిందా అంటే.. అవును అనే సమాధానం తప్ప, కాదు అని చెప్పేందుకు ఎంత వెదికినా సమాధానం దొరకడం లేదు!
వచ్చినోళ్లంతా ఎందుకు పోయారు!
2019 తర్వాత తెలంగాణ బీజేపీలోకి చాలామంది నాయకులు వచ్చారు. నిజానికి వారంతా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీలో చేరినవారే. వారంతా బీఆర్ఎస్పై సీరియస్‌గా పోరాడే పార్టీగా, అధికారంలోకి వచ్చే పార్టీగా బీజేపీని భావించారు. నిజానికి 2022 తర్వాత నుంచి పార్టీ ‘సైలెంట్ మూడ్’ చూసి నిరాశకు గురయ్యారు. 2022 తర్వాత నుంచి వారు తిరిగి వెళ్లి పోవడం మొదలుపెట్టారు. ఇక బీఆర్ఎస్ను ఓడించగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని వారంతా ఆ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వారంతా ఉపయోగపడ్డారు కూడా! వాళ్లంతా ఎందుకు వెళ్లిపోయారో మోదీ తెలుసుకోలేకపోవడంలోనే పొరపాటు ఉన్నపుడు, ప్రస్తుత ఎంపీలను మాత్రమే ప్రశ్నిస్తే ప్రయోజనం ఏముంటది?
ఒవైసీ ఉదాహరణ మతలబేంది?
‘సోషల్ మీడియాలో బీజేపీ కన్నా, ఒవైసీ సోషల్ మీడియా బలంగా ఉందని, కనీసం ఆయనను చూసైనా నేర్చుకోండి’ అని మోదీ హితబోధ చేయడమే ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. తెలంగాణలో బీజేపీకి రాజకీయ పోటీదారులు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉండగా.. ఒవైసీ సోషల్ మీడియాను ఉదాహరణగా చెప్పడమే ఆశ్చర్యకరం. తెలంగాణలో ఒవైసీ సోషల్ మీడియాను గుర్తించిన మోదీ.. కేసీఆర్, రేవంత్‌రెడ్డితో పోటీపడాలని ఎందుకు చెప్పలేకపోయారు? ఒవైసీ ఒక ఎంపీ మాత్రమే. మోదీ దేశానికి ప్రధాని. ఒవైసీ ఉదాహరణ చెప్పడం మోదీకి ఎంతమాత్రం శోభనివ్వలేదు. పార్టీని ‘స్లీపింగ్ మూడ్’ లోనే ఉంచుతూ అసలు సమస్యను పక్కదారి పట్టించడానికే ఒవైసీ ఉదాహరణ చెప్పి ఉంటాడని ఎందుకు అనుకోకూడదు? పార్టీని పాతబస్తీకే పరిమితం చేస్తే.. తెలంగాణ అంతటా బలపడేదెలా మరి!
సోషల్ మీడియా బహానా!
సోషల్ మీడియా అనేది ఏ పార్టీకైనా ఒక అంగం మాత్రమే, అది సర్వాంగం కాదు. సర్వాంగాలను వదిలేసి ఒక సోషల్ మీడియాతోనే ఒక రాజకీయ పార్టీ బలపడుతుందా? అదే నిజమైతే, బీఆర్ఎస్ ఓడిపోయేది కాదు మరి! కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదీ కాదు! ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్కడో మిస్సయినట్లున్నారు!
బీసీ వాదం ఏమైంది?
బండి సంజయ్ సంగ్రామ యాత్రలు బీజేపీకి తెలంగాణలో ఒక ఊపు తెచ్చిన మాట నిజం. దాంతో బీజేపీకి బీసీల పోలరైజేషన్ కూడా జరిగింది. సంజయ్‌ని తొలగించారు. మళ్లీ ఒక బీసీని అధ్యక్షుణ్ణి చేయలేదెందుకు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది అమిత్ షానే. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ 8 స్థానాలు గెలవడం వెనకాల ఒక్క మోదీ పేరు మాత్రమే కాదు, బీజేపీకి బీసీల పోలరైజేషన్ కూడా భారీగా పనిచేసింది. సంజయ్ తర్వాత ఇద్దరినీ ఓసీలనే అధ్యక్షులను ఎందుకు చేశారు? పార్టీని స్లీపింగ్ మూడ్‌లో కొనసాగించడానికే అలా చేశారనే అనుమనాలకు అవకాశమిచ్చారు. యూపీ, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తెస్తున్నది బీసీ, ఈబీసీలే. తెలంగాణలోనూ బీసీ వాదానికి అనుగుణంగా ఒక అధ్యక్షుణ్ణి ఎందుకు నియమించలేకపోయారో మోదీకే తెలియాలి!
పోరాటమేది?
మొన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే చాలా చక్కగా చెప్పాడు.. పార్టీ ఫార్మాట్ మారాలని! పదేండ్ల కేసీఆర్ పాలనలోని అవినీతిపై కేసులు, జరిగిన దర్యాప్తులు రెండేండ్లుగా మూల్గుతున్నాయి. వాటిపై బీజేపీ ఏమేరకు పోరాడుతున్నదో మోదీ ఆరా తీశారా? కాళేశ్వరం దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. కదలికలేదెందుకు? అలాగే మిగతా దర్యాప్తులపై తాత్సారం చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ పోరాటమేది? తెలంగాణ రాజకీయాలను ఇప్పటికీ ఆంధ్రా లాబీలే నడుపుతున్నాయనే అనుమానాలున్నాయి! వాటన్నిటిని పక్కదారి పట్టిస్తూ అక్కరలేని ఒవైసీ సోషల్ మీడియా గొప్పతనం గురించి చెప్పడం ప్రధాని మోదీకి తగిన పనేనా?
సానుకూలత ఉన్నా.. నాటకీయతా?
తెలంగాణలో సానుకూలత పరిస్థితులను సైతం పక్కన పెట్టడమంటే, మరేదో బ్రహ్మరహస్యం ఉంటదనే అనుమానాలు సర్వత్రా ఉన్నాయి. పదకొండేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఒకవైపు, రెండేండ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్ మరొకవైపు ఉండగా ఇంతకు మించిన రాజకీయ సాను కూలత ఇంకేముంటది? బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష పార్టీ. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ అవినీతిని పొలిటికల్ పబ్లిసిటీకి వాడుకుంటున్న పరిస్థితి తప్ప యాక్షన్లు లేవు. అలాంటి రెండు పార్టీలపై పోరాటాల గురించి తెలంగాణ ఎంపీలను మోదీ అడిగాడా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల ఫలితాలే చెపుతున్నాయి కదా బీజేపీ స్లీపింగ్ మూడ్‌లో ఉంచబడిందని!
ఎవరికోసమో?
కానీ ఎదిగొచ్చిన తెలంగాణలో పార్టీని సైలెంట్ మూడ్ లో ఎందుకోసం, ఎవరికోసం నడుపుతున్నారో ప్రజలకు తెలియడం కష్టమే కావచ్చు. కానీ అది తెలంగాణ ఆరోగ్యకర రాజకీయాలకు మాత్రం చాలా హానికరం! తెలంగాణ రాజకీయాలు (బీఆర్ఎస్తో సహా అన్ని పార్టీలు) ఇప్పటికీ ఆంధ్రా లాబీల ప్రభావంలో నడుస్తున్నాయి! ఈ నేపథ్యంలో బీజేపీ ‘స్లీపింగ్ మూడ్’ తెలంగాణకు ఎంత అనర్థమో అర్థం చేసుకోవాల్సింది మాత్రం ప్రధాని మోదీనే!
పెద్దల మాటలకు అర్థాలె వేరులే!
దక్షిణాది ఎన్డీఏ పార్లమెంటు సభ్యులందరినీ అల్పాహారానికి ఆహ్వానించారు కాబట్టి, అది తెలంగాణ ఎంపీలను మాత్రమే ఆహ్వానించిన సమావేశం కాదు! నిజంగా మోదీ తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై సమీక్ష చేయాలనుకుంటే, తెలంగాణ ఎంపీలతో మాత్రమే ప్రత్యేక సమావేశం జరపాలి! ముఠాలుగా ఏర్పడిన వారిని హెచ్చరించి ఉండాలి! అలా చేయలేదు. విందు గుంపులో అడగడమే విచిత్రం. విందుకు వచ్చిన వారిని పలకరించక తప్పదు అన్నట్లుగా.. నాలుగు హెచ్చరిక వాక్యాలతో సరిపుచ్చారు ఎందుకు? అనేదే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. అధిష్టానం ఉద్దేశాలు సరైనవైతే రాష్ట్ర నేతలు ఇలా ఉండేవారా?
ఇంకా స్లీపింగ్ మూడ్‌లోనే ఉంచాలనా..!
తెలంగాణలో పార్టీ బలపడాలంటే.. ప్రజలకు చేరువయ్యేందుకు సవాలక్ష ప్రజాసమస్యలు ఉండగా.. ఒవైసీ సోషల్ మీడియాను చూసి నేర్చుకోమని మోదీ చెప్పడమే ఒక విచిత్రం! కాంగ్రెస్, బీఆర్ఎస్ లను వదిలేసి, కేవలం ఒవైసీతో పోటీపడాలని చెప్పడం చూస్తే.. తెలంగాణలో బీజేపీని ఇంకా ‘సైలెంట్ మూడ్’లోనే ఉంచాలనేదే మోదీ ఉద్దేశం అనే అనుమానం రావడం సహజం! పార్టీని స్లీపింగ్ మూడ్‌లో మరెవరికోసమో ఉంచుతున్నారనే అనుమానాలను మాత్రం మోదీ నివృత్తి చేయడం లేదు!
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
