- నవంబర్‌లో వాణిజ్య లోటు 5 నెలల కనిష్టానికి
- పెరిగిన ఎగుమతులు, తగ్గిన దిగుమతులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో వస్తువుల వాణిజ్య లోటు (దిగుమతులు మైనస్ ఎగుమతుల విలువ) ఐదు నెలల కనిష్టానికి తగ్గింది. ఎగుమతులు 19.37శాతం పెరిగి 38.13 బిలియన్ డాలర్లకి చేరగా, దిగుమతులు 1.88 శాతం తగ్గి 62.66 బిలియన్ డాలర్లకు దిగొచ్చాయి. దీంతో వాణిజ్య లోటు 24.53 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు పెరగడంతో పాటు, బంగారం, క్రూడ్ ఆయిల్, బొగ్గు దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 41.68 బిలియన్ డాలర్ల లోటు నమోదు కాగా, జూన్‌లో కనిష్టంగా 18.78 బిలియన్ డాలర్లు నమోదైంది.
ఈ ఏడాది ఏప్రిల్–నవంబర్ కాలంలో భారత ఎగుమతులు ఏడాది లెక్కన 2.62 శాతం పెరిగి 292.07 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 5.59 శాతం పెరిగి 515.21 బిలియన్ డాలర్లకు చేరాయి.
మొత్తం వాణిజ్య లోటు 223.14 బిలియన్ డాలర్లుగా ఉంది. 50శాతం టారిఫ్ ఉన్నప్పటికీ, అమెరికా భారత ప్రధాన ఎగుమతి గమ్యస్థానంగా కొనసాగుతోంది. యూఏఈ, చైనా, యూకే, జర్మనీ, సింగపూర్, బంగ్లాదేశ్, సౌది అరేబియా కూడా కీలక ఎగుమతి మార్కెట్లుగా ఉన్నాయి.
