వెలుగు ఓపెన్ పేజీ : ఫుట్ బాల్ ప్లేయర్ లా ఫిట్ సీఎం!

వెలుగు ఓపెన్ పేజీ :  ఫుట్ బాల్  ప్లేయర్ లా ఫిట్  సీఎం!

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి ఫుట్‌‌బాల్  మ్యాచ్‌‌ను ఆడటం రాజకీయాల్లోనే  సంచలనం సృష్టించింది.   ఫుట్‌‌బాల్  దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ రాక సందర్భంగా జరిగిన మ్యాచ్‌‌లో  రేవంత్ రెడ్డి  మైదానంలోకి దిగడం,  ఆడటం యాభై ఆరేళ్ల వయసులోనూ అంత ఫిట్‌‌గా కనిపించడం ఒక సర్​ప్రైజ్​లా కనిపించింది. ఇప్పటివరకూ  ఏ  సీఎం జెర్సీ ధరించి,  పూర్తిస్థాయి ఆటగాడిలా  మైదానంలోకి  దిగలేదు.  ఈ ఘటన ద్వారా ‘నాయకుడు అంటే కేవలం ఫైళ్ల మధ్య కాదు... జీవితంలోని  ప్రతి రంగంలోనూ ముందుండాలి’ అనే  సందేశాన్ని ఇచ్చినట్లయింది.  ప్రపంచదృష్టిని  హైదరాబాద్, తెలంగాణ వైపు  మళ్లించడంలో ఈ మ్యాచ్​తోపాటు  మెస్సీ రాక బాగా ఆకర్షించింది.

రేవంత్ రెడ్డి  రాజకీయాల్లోకి తీసుకువచ్చిన అతి పెద్ద మార్పు అని చెప్పుకొనేది ఈ మధ్య  యువతకు ఇస్తున్న స్పూర్తి.  రాజకీయాలు అంటే  భయపడాల్సిన రంగం కాదని,  సాధారణ నేపథ్యం నుంచి వచ్చినవారూ వ్యవస్థను మార్చగలరని తానూ నిరూపించానని,  ఇలా ఎవరికైనా సాధ్యమే అని చెప్పటం ద్వారా యువతకు ఓ మంచి సందేశమిచ్చారు. భాష, నేపథ్యం, ఆర్థిక పరిస్థితి ఏవీ అడ్డుకావని... ధైర్యం, కష్టం, నిబద్ధత ఉంటే సరిపోతుందని ఆయన పదేపదే చెప్పటం విశేషం.  గ్రామీణ పాఠశాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వచ్చిన  రేవంత్ రెడ్డి  ప్రయాణం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు.  అది ఒక తరం ఆశగా చెప్పాలి.  సీఎం హోదాలోనూ,  స్పోర్ట్స్‌‌మన్‌‌గా,  ప్రజా నాయకుడిగా ఆయన చూపిస్తున్న శక్తి,  తెలంగాణ  రాజకీయాలకు  కొత్త నిర్వచనమే.  

ప్రజల పక్షాన పరిపాలన

వ్యవస్థలోని జడత్వాన్ని తొలగించడం,  పరిపాలనను  ప్రజల పక్షాన నిలబెట్టడానికి పాలకుడిలో చురుకుదనం అవసరం.  ఇంగ్లిష్  మాట్లాడలేకపోవడం అభివృద్ధికి అడ్డంకి కాదని ఆయన బహిరంగంగానే చెప్పారు.  ‘నాకు వచ్చిన భాషలో  నేను నా ప్రజల కోసం మాట్లాడుతున్నాను’ అని చెప్పడం ద్వారా  గ్రామీణ యువతలోని  సంకోచాన్ని తొలగించారు. 

 తానే ఆ మాటకు ఉదాహరణగా నిలిచి, రాష్ట్ర యువతరానికి కొత్త రాజకీయ ఆత్మవిశ్వాసాన్ని పరిచయం చేశారు.  .  ప్రజలతో నేరుగా మాట్లాడటం,  యువత భాషలో స్పందించడం, అవసరమైతే  అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించడంలో  వెనుకాడకపోవడం ఇవన్నీ ఆయన రాజకీయ శైలిగా చెప్పొచ్చు.  ఉమ్మడి  మహబూబ్‌‌నగర్  జిల్లాలోని  ఓ మారుమూల  గ్రామంలో పుట్టి,  జిల్లా  పరిషత్  పాఠశాలలో  తెలుగు మీడియంలో చదువుకున్న సాధారణ యువకుడు.. ఇయ్యాల  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలవడం నిజంగా స్ఫూర్తిదాయకం.  

కొత్త రాజకీయ ధోరణికి ప్రతీక

తెలంగాణ రాజకీయాల్లోనే కాదు  దేశ రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు సాధించడానికి కృషి చాలా అవసరం. రేవంత్​ పనితీరు, చురుకుదనం అందుకు దగ్గరగా ఉంటున్నాయి.  సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, తన వ్యక్తిత్వం, సాహసం, స్పష్టమైన మాట, ప్రజల మధ్య ఉండే స్వభావంలో  ఒక కొత్త రాజకీయ ధోరణి తేవాలనే తపన ఆయనలో ఉంది. 

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, ప్రదర్శించిన రాజకీయ పటిమ ఆయనకు కలిసొస్తున్న అంశాలు. సీఎంగా రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి మరో మూడేళ్లు సీఎంగా పని చేసే తీరు ఆయనకు రాజకీయ బాటగా మారబోతుంది. పాలనలో వేగం,  నిర్ణయాల్లో  స్పష్టత,  ప్రజా సమస్యలపై తక్షణ స్పందన..ఇవన్నీ ఆయన పాలనకు గీటురాళ్లుగా మార్చుకోగలుగుతారని చెప్పొచ్చు.  వ్యవస్థలోని  జడత్వాన్ని తొలగించడం,  పరిపాలనను ప్రజల పక్షాన నిలబెట్టడం ఆయన ప్రధాన లక్ష్యాలు కావాలి.

- వేలూరి శ్యామ్​కుమార్​,సీనియర్​ జర్నలిస్ట్​