
రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల వెంకటాపూర్ లో.. మామిడి కాయల సేకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సేకరణ కేంద్రం మామిడికాయల విక్రయాల్లో కొత్త ఒరవడిని సృష్టించడంతో పాటు మామిడి రైతులకు వరంలా మారనుందని చెప్పారు. జిల్లా సెర్ప్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో సేకరణ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. సేకరణ కేంద్రంలో మామిడి రైతులకు మూడు రకాలుగా ఎంతగానో మేలు చేకూరుతుందని తెలిపారు. మామిడి రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని, రైతులకు తరుగు ఇబ్బంది, వ్యయప్రయాసలు తప్పుతాయని అన్నారు. గడ్డిఅన్నారం మార్కెట్ ధర ప్రకారం రోజూవారీ ధరలు ఉంటాయని వివరించారు.
1700 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయని, ఇక్కడ మామిడికాయల సేకరణ కేంద్రం ఏర్పాటు చేసుకున్నామని మంత్రి తెలిపారు. మామిడి రైతులు నాణ్యమైన దిగుబడి సాధించేలా రైతులకు శిక్షణ కూడా ఇప్పించామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 13,400 ఎకరాల్లో మామిడితోటలు సాగు చేస్తున్నారు. మామిడికే కాకుండా సెర్ప్ పద్ధతిలో కూరగాయల విక్రయాలు జరిపే యోచనలో ఉన్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లాలో నంగునూరు, కొహెడ, అక్కన్నపేట, మద్దూర్, చిన్నకోడూర్, కొండపాక, జగదేవ్ పూర్ మండలాల్లో సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న దృష్ట్యా బెనిషా కొనుగోళ్ల కేంద్రాలను ఈ పంటకే అందించేలా ఏర్పాటు చేయించాలని డీఆర్డీఏ పీడీ గోపాల్ రావును మంత్రి ఆదేశించారు.