బీఆర్ఎస్‌లో రచ్చ.. మంత్రి హరీశ్ రావు సీరియస్

బీఆర్ఎస్‌లో రచ్చ.. మంత్రి హరీశ్ రావు సీరియస్

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీలో మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్‌‌ బొంగుల విజయలక్ష్మి అవినీతి వ్యవహారం రచ్చకెక్కింది. సొంత పార్టీ కౌన్సిలర్లే ఆమెపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ మీటింగ్‌‌లో చైర్‌‌‌‌పర్సన్‌‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. పదవి నుంచి దిగిపోవాల్సిందేనని పట్టుబట్టారు.  వీరికి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు మద్దతుగా నిలవడంతో ఇష్యూ మరింత ముదిరింది.  మరోవైపు కాంగ్రెస్‌‌ కౌన్సిలర్‌‌‌‌పై బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్ కేసు పెట్టడంతో మైనార్టీ నేతలు ఆందోళనకు దిగడం హాట్ టాపిక్‌‌గా మారింది.  తాజా పరిస్థితులపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌ రావు ఆరా తీసి స్థానిక నేతలపై సీరియస్ అయినట్టు తెలిసింది.  మున్సిపల్ చైర్‌‌పర్సన్‌‌ విషయంలో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.  

20 మంది కౌన్సిలర్లు వ్యతిరేకం

 సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి మున్సిపల్ నిధులను స్వాహా చేశారని, ఆమె బంధువులు మున్సిపల్ ఆఫీసులో డ్యూటీ చేయకుండానే హైదరాబాద్‌‌లో ఉంటూ నెలనెలా జీతాలు తీసుకుంటున్నారని సొంత పార్టీ కౌన్సిలర్లు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన మీటింగ్‌‌లో 20 మంది కౌన్సిలర్లు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వం విజిలెన్స్‌‌తో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  వీరి ఆరోపణలపై స్పందించిన చైర్‌‌‌‌పర్సన్‌‌ రుజువులు ఉంటే చూపించాలని, నిరాధార ఆరోపణలు చేస్తే పోలీసు కేసు పెడతానని హెచ్చరించారు. ఈ క్రమంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.  కాగా, చైర్ పర్సన్ అవినీతితో పాటు ఆమె భర్త ఒంటెద్దు పోకడపై అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లు  కొన్నాళ్ల కిందే అవిశ్వాసం పెట్టాలని చూశారు. పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వెనక్కి తగ్గారు. కానీ, ఎలాంటి మార్పు రాకపోవడంతో బహిరంగ విమర్శలకు దిగుతున్నారు.  చైర్‌‌‌‌పర్సన్‌‌ వ్యవహారంపై హైకమాండ్ ఏదో ఒకటి తేల్చకపోతే,  తామే ఓ నిర్ణయానికి హెచ్చరిస్తున్నారు.

బీఆర్‌‌ఎస్‌ నేతల తీరుపై మైనార్టీల నిరసన

మున్సిపల్ మీటింగ్‌లో జరిగిన పరిణామాలపై మూడు రోజుల కింద  మైనార్టీ నేతలు ఆందోళనకు దిగారు.  మీటింగ్‌లో 24వ వార్డు కౌన్సిలర్ హఫేజ్ షేక్ షఫీ తనను చైర్‌‌తో కొట్టబోయాడని బీఆర్ఎస్ కౌన్సిలర్ శ్రీకాంత్ (నాని) పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు.  దీనిపై మండిపడ్డ మైనార్టీ సంఘాల నేతలు మంత్రి కేటీఆర్‌‌, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చేనేత కార్పొరేషన్ డెవలప్‌మెంట్‌ చైర్మన్ చింతా ప్రభాకర్ దిష్టిబొమ్మలను దహనం చేయడంతో పాటు సంగారెడ్డి పాత బస్తీలో నిరసన ర్యాలీ నిర్వహించారు. 

మున్సిపల్‌ ఇష్యూ కాస్త మైనార్టీలు బీఆర్‌‌ఎస్‌ను వ్యతిరేకించే దాకా వెళ్లడంతో లోకల్ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.  అయినా పరిస్థితులు సద్దుమణగకపోవడంతో మంత్రి హరీశ్‌ రావు  ఆరా తీసినట్లు తెలిసింది. చిన్న ఇష్యూను పెద్దది చేస్తారా..? అని పార్టీ లీడర్లపై మండిపడ్డట్లు  ప్రచారం జరుగుతోంది.  ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు పార్టీకి మంచివి కావని, అసంతృప్త కౌన్సిలర్లతో పాటు మైనార్టీ నేతలతో మాట్లాడి నచ్చజెప్పాలని సూచించినట్లు సమాచారం.