ప్రతిపక్షాలది కుర్చీల కొట్లాట : హరీశ్ రావు

ప్రతిపక్షాలది కుర్చీల కొట్లాట : హరీశ్ రావు

నారాయణ్ ఖేడ్,వెలుగు: ప్రతిపక్షాలది కుర్చీల కోసం మాత్రమే కొట్లాటని మంత్రి  హరీశ్ రావు ధ్వజమెత్తారు. మంగళవారం  పట్టణంలో ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి లతో పాల్గొని మాట్లాడారు.  తెలంగాణ ప్రజలకు మాత్రమే తాము బీ టీం అని  స్పష్టం చేశారు. రాహుల్ గాంధీది బీజేపీని వ్యతిరేకించే డీఎన్ఏ అని చెప్తూ ఉంటారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో అనేక పార్టీలు మారి, రేపు ఏ పార్టీకి వెళ్తారో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. 

ఒకప్పుడు సోనియాగాంధీని బలి దేవతని అన్నాడని, ప్రస్తుతం దేవత అంటున్నాడన్నారు.  సీంఎ కేసీఆర్ ప్రతిపక్ష లీడర్లపై పగ కోసం పనిచేయడని, ప్రజల అభివృద్ధి కోసమే పని చేస్తారన్నారు. లేదంటే   రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైలుకు వెళ్లే వాడన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నటికీ కలవబోవన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు పనికిరానివన్నారు.  పట్టణంలో 30న నిర్వహించే సీఎం ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో చింతల గీతారెడ్డి,  బిక్షపతి,  మామిడ్ల రాజేందర్,  పరమేశ్,​ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.