కేసీఆర్​ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటైనయ్

కేసీఆర్​ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటైనయ్

సదాశివపేట/కంది, వెలుగు: కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా గెలుస్తారని తెలిసి, ఆయనను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ పార్టీలు ఒక్కటయ్యాయని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరాలని బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో.. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం బయటపడిందని అన్నారు. బుధవారం సదాశివపేట పట్టణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన మన బీన్ ఫౌండేషన్ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు​లాయర్ ముఖీమ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. హరీశ్ రావు వాళ్లకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతైందని, ఆ పార్టీ నేతలు బీజేపీకి పూర్తి స్థాయిలో సహకరించారని ఆరోపించారు. ‘‘మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరఫున రాజగోపాల్ రెడ్డి పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. అయినప్పటికీ ఆయన మీద కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని చెప్పారు. కాంగ్రెస్​లో లీడర్ల మధ్య సమన్వయం లేదని, సీఎం అభ్యర్థి ఎవరో కూడా తేల్చుకోలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉందని విమర్శించారు. ‘‘గతంలో కాంగ్రెస్ కు 11 సార్లు అవకాశమిస్తే, తెలంగాణను అధోగతిపాలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఆ పార్టీ వాళ్లు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు” అని మండిపడ్డారు. 

సంగారెడ్డి అభివృద్ధి బాధ్యత నాదే.. 

సంగారెడ్డి ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదేనని హరీశ్​రావు హామీ ఇచ్చారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ‘‘కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జగ్గారెడ్డి ఐదేండ్లుగా ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అధికారంలో లేకున్నా, ఆరోగ్యం సహకరించకపోయినా సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం చింతా ప్రభాకర్​ఎంతో కృషి చేశారు” అని హరీశ్ రావు అన్నారు.