హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ గజినీలకు అర్థం కావడం లేదు : హరీష్ రావు

హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ గజినీలకు అర్థం కావడం లేదు : హరీష్ రావు

ఎరుకల సంక్షేమ కోసం రూ.60 కోట్లతో ఎంపవర్మెంట్ స్కీం ఏర్పాటు చేశామన్నారు మంత్రి హరీష్ రావు. ఎరుకల వర్గాన్ని గత ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకోలేదని, వారిని గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అని చెప్పారు. ఎరుకల సంక్షేమ పథకాల కోసం మాట్లాడే గొంతు ఉండాలని, వారిని చట్టసభల్లోకి తీసుకెళ్తామన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి మెట్రో ట్రాక్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఎరుకల ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిలుగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు.

గత ప్రభుత్వాలు ఎరుకల కులానికి చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు. సినీ  హీరో రజినీకాంత్ హైదరాబాద్ ను మెచ్చుకున్నారని, ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న గజినీలకు అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోతోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వాళ్లు చెప్పింది ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. 

ప్రభుత్వ లాంఛనాలతో ఎరుకల కుల దేవత నాంచారమ్మ జాతరను నిర్వహిస్తామన్నారు. ఎరుకల కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తే అడ్డుపడి ఆపారని చెప్పారు. త్వరలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేస్తామని, దీన్ని ప్రతిపక్షాలు ఆపగలవా..? అని ప్రశ్నించారు. నిజాంపేట్ లో ఎకరం స్థలంలో రూ.5 కోట్లతో కుల భవనం ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని చెప్పారు. విద్య, ఆరోగ్య శాఖలో 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ దే అన్నారు. 

తెలంగాణ బీజేపీ చీఫ్ సలహాదారుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే అన్నం తినని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ శత్రువులందరూ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటున్నారని చెప్పారు. 

కూకట్ పల్లి ప్రాంతంలో వాటర్ కోసం అప్పట్లో యుద్ధం చేసిన ఎమ్మెల్యే మాధవరం  కృష్ణారావు.. తెలంగాణ వచ్చాక ఒకరోజు కూడా నీటి సమస్య లేదన్నారు. కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు నిత్యం ప్రజల మధ్య ఉండే మనిషి అని, ఆయన్ను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.