
కంది, సదాశివపేట, రాయికోడ్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణకు నోచుకోని వందల ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్, హుమ్నాపూర్ శివారులోని మంజీరాలో నిర్వహిస్తున్న గరుడ గంగా కుంభమేళాలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి కాశీనాథ్ బాబా, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, భూపాల్ రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌తో కలిసి కుంభ కలషాన్ని నదిలో కలిపి పూజలు చేశారు. అనంతరం గంగమ్మకు హారతి ఇచ్చి పంచవటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు.
అనంతరం మండలంలోని కాకిజన్వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు సదాశివపేట మండలం రేజింతల్ శివారు, సిద్దాపూర్ రోడ్డులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 500 మంది లబ్ధిదారులకు అందజేశారు. అలాగే కంది మండలం కాశీపూర్‌లో వీర శైవ లింగాయత్ భవన (బసవ భవన్) నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో మంత్రి మాట్లాడుతూ బసవేశ్వరుని భవన నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బసవేశ్వరుడు 12 శతాబ్ధంలోనే కుల రహిత సమాజం కోసం కృషి చేశారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ, ఆర్డీవో మెంచు నగేశ్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మా భూమి అన్యాయంగా లాక్కున్నరు..
కాశీపూర్ గ్రామంలో వీరశైవ లింగాయత్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్థలం తమదని కొందరు బాధితులు ఆరోపించారు. మంత్రికి విన్నవించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి ఆ భూమిలో పంటలు పండించుకుంటున్నామని, అన్యాయంగా లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.