బోర్లకు మీటర్లు పెడితే రూ. 30 వేల కోట్లు వచ్చేవి..కానీ వద్దనుకున్నాం : హరీష్ రావు

బోర్లకు మీటర్లు పెడితే రూ. 30 వేల కోట్లు వచ్చేవి..కానీ వద్దనుకున్నాం : హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు కూడా సాగునీరందలేదని కొందరంటున్నారని..అలాంటి వాళ్ల చెంప చెళ్లుమనిపించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో, గాంధీ భవన్లో కూర్చోని మాట్లాడితే ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. గ్రామాల్లోకి వచ్చి చూస్తే కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో తెలుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు చర్చపెట్టి.. ఇతర పార్టీల నాయకుల చెంప చెళ్లుమనిపించాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లోని చెరువులు నిండుకుండల్లా మారాయని అన్నారు. చిన్నకోడూరు మండలంలో గతంలో 5వేల ఎకరాల్లో పంటలు పండితే..కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 20 వేల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన పాలకమండలి చూసుకోవాలని సూచించారు. 

రూ. 30 వేల కోట్లు వద్దనుకున్నాం
వ్యవసాయానికి సీఎం కేసీఆర్ ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపిందన్నారు. ఈ నిర్ణయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించిందని చెప్పారు. బోర్లకు మీటర్లు పెట్టడం ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ. 30 వేల కోట్లు వచ్చేవని...అయినా రైతుల ప్రయోజనం కోసం ఆ నిధులను వద్దనుకున్నామన్నారు. రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయని కేంద్రం..రాష్ట్ర ప్రజలకు నూకలు అలవాటు చేయమని హేళన చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అన్నదాతలు పండించిన ప్రతీ గింజను కొంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నల్ల చట్టాల వల్ల రైతులు నష్టపోయారన్నారు. పెట్రోల్, డిజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచిందని మండిపడ్డారు.