కాళేశ్వరం ప్రాజెక్టుతోనే భూముల ధరలకు రెక్కలు

కాళేశ్వరం ప్రాజెక్టుతోనే భూముల ధరలకు రెక్కలు

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఉత్తర తెలంగాణలో వాగులు ఎండిపోయేవని మంత్రి హరీష్ రావు అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాక..ఎండల్లోనూ వాగుల్లోకి నీళ్లువచ్చాయని చెప్పారు.  రాష్ట్రంలో 60 వేల మందికి రైతు బంధు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. పక్క రాష్ట్రాల నుంచి మగ కూలీలు వచ్చి ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండు పంటలు పక్కా పండుతాయని తెలిసే..మన భూముల ధరలు విపరీతంగా  పెరిగాయని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల గ్రామంలో పర్యటించిన ఆయన.. నూతన గ్రామపంచాయతీ భవనం, మహిళ భవనం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను  ప్రారంభించారు. 

వడ్లను కొనలేక చేతులెత్తేశారు..
సాగు విస్తీర్ణం పెరిగి..రాష్ట్రంలో రైతులు వడ్లను పండిస్తే..కేంద్రం వాటిని కొనలేక చేతులెత్తేసిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలావాటు చేయాలని హేళన చేశారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి వడ్లను సేకరించిందని గుర్తు చేశారు. రైతుల నుంచి సేకరించిన వడ్లు రైస్ మిల్లుల్లో మొలకలు ఎత్తాయని..అయినా అన్నదాతలకు డబ్బులు చెల్లించామన్నారు. చైనా, పాక్ లో వరదలు వచ్చి ప్రపంచంలో బియ్యానికి డిమాండ్ పెరిగిందన్నారు. కానీ కేంద్రం మాత్రం బియ్యం ఎగుమతిని నిషేధించిందని చెప్పారు. పైగా బియ్యంపై 20 శాతం సుంకం వేసిందన్నారు. రైతుల బావి కాడ మీటర్లు పెట్టమని కేంద్రం ఒత్తిడి చేస్తుందన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని..అందుకే కేంద్రం ఇచ్చే రూ. 30 వేల కోట్లు కూడా వద్దనుకున్నారని వెల్లడించారు. 

హామీలు ఏమయ్యాయి...?
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు పెరిగిపోయాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. వంట సిలిండర్ ధరను రూ. 400  నుంచి రూ.1200 లకు పెంచి...సబ్సిడీని ఎత్తేసిందన్నారు.  ఏటా 2వేల ఉద్యోగాలు ఇస్తామన్న  మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. జన్ ధన్ ఖాతాలు అన్నారని..అవన్నీ ధన్ ధన్ ఖతమైందని ఎద్దేవా చేశారు.