ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం సాయం చేస్తలె

ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం సాయం చేస్తలె
  • కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకియ్యరు?:  హరీశ్​
  • అగ్నిపథ్ స్కీంతో యువతకు మోసం
  • 15 రోజుల్లో ధరణి సమస్యలను పరిష్కరిస్తమని హామీ 

సంగారెడ్డి/మెదక్, వెలుగు: రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాయం చేస్తలేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘కర్నాటకలోని ఎగువ భద్ర, బుందేల్ ఖండ్​లో కెన్ బెత్వా, ఏపీలోని పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. కానీ మన కాళేశ్వరానికి లేకుంటే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే మొండి చేయి చూపిస్తున్నారు” అని ఆయన కేంద్రంపై ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం వట్ పల్లి మండలం తాలెల్మా గ్రామ శివారులో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. అగ్నిపథ్ పేరుతో యువతను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. 

ధరణిలో మార్పులకు అవకాశమిస్తాం  
ధరణి పోర్ట్​ల్​లో వస్తున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. మెదక్​జిల్లా అల్లాదుర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ధరణిలో 95 శాతం ఫలితాలు బాగున్నాయని, 5 శాతం సమస్యలతోనే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ధరణిలో సమస్యల పరిష్కారానికి, మార్పులు, చేర్పులకు పదిహేను రోజుల్లోనే అవకాశం కల్పిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందజేస్తామని, త్వరలో 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు ఇస్తామన్నారు. సొంత జాగా ఉన్న వాళ్లు ఇండ్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.