ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా

ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా

ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పచ్చి అబద్దాలు  చెప్పారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా ఓ కేంద్రమంత్రే ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరిందని సమాధానం చెప్పారని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ  చేరలేదని నిరూపిస్తూ ఇప్పుడే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అబద్దాలు చెప్పే కేంద్రమంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్ కూడా చేరిపోయారని చురకలంటించారు. తెలంగాణ ప్రజలకు అబద్దాలు చెప్పిన నిర్మలా సీతారామన్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ కంటే  ఆరోగ్యశ్రీ గొప్పపథకమన్నారు. ఆరోగ్య శ్రీ  కింద ప్రభుత్వం రూ. 10 లక్షల వరకు ఖర్చు చేస్తోందని తెలిపారు. రేషన్ షాప్ వద్ద ప్రధానమంత్రి ఫోటో ఏర్పాటు చేయాలని ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా నిర్మల సీతారామన్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 

చేరకపోతే నిధులు ఎందుకు మంజూరు చేశారు..?
గోబెల్స్ ప్రచారం చేయడంలో బీజేపీ ప్రభుత్వానికి నోబెల్ బహుమతి ఇవ్వాలని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పై ఢిల్లీలో ఓ కేంద్ర మంత్రి నిజం చెప్తే..గల్లీలో మరో కేంద్రమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో చేరకపోతే ఈ పథకం కింద గతేడాది రూ. 150 కోట్లు , ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ కింద మరో రూ. 43 కోట్లు ఎందుకు మంజూరు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ కింద రూ. 505 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. 

దేశాన్ని సాదే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధుల కంటే..తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లే నిధులే ఎక్కువన్నారు. ఇప్పటి వరకు కేంద్రానికి తెలంగాణ.. రూ. లక్షా 70 వేల కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ డబ్బులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని చెప్పారు. దేశాన్ని సాదే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి తెలిపారు. అటు ఉచిత బియ్యంపై బీజేపీ నేతలు మాట్లాడుతున్నవి అన్నీ అబద్దాలేనని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలకు 10 కేజీల ఉచిత బియ్యం తెలంగాణ ప్రభుత్వమే ఇస్తోందని తెలిపారు. ఉచిత బియ్యం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 3,610 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు.  

పచ్చి అబద్దాలు మాట్లాడారు
వరంగల్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పచ్చి అబద్దాలు మాట్లాడారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వరంగల్ హెల్త్ సిటీ పనులు అతీగతీ లేదన్నారని విమర్శించారు. కానీ వరంగల్ హెల్త్ సిటీ పనులు అద్భుతంగా జరుగుతున్నాయని..ఇప్పటికే 15 శాతం పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. అటు కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదని అమిత్ షా చెప్తున్నారని..కాళేశ్వరంతో సాగునీరిచ్చామో లేదో..ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలను అడిగితే చెప్తారన్నారు. 
కాళేశ్వరం గ్రోత్ ఇంజన్ ఆఫ్ తెలంగాణ అని కేంద్రమంత్రి గడ్కరే చెప్పారని గుర్తు చేశారు.