బీజేపీ నేతలకు దమ్ముంటే గ్యాస్‌ ధర తగ్గిస్తామని చెప్పండి

V6 Velugu Posted on Sep 25, 2021

బీజేపీ నాయకులు బొట్టు బిళ్లలు ఇవ్వడం కాదు... పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించి మాట్లాడాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. అభివృద్ది, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్‎కి ఓటు వేయాలని ఆయన సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ప్రతాపసాయి గార్డెన్‎లో అర్హులైన లబ్దిదారులకు మ్యూటేషన్, ప్రొసిడింగ్‎లు, విద్యుత్ కనెక్షన్, నీటి కుళాయి, గృహ నంబర్, యాజమాన్య మార్పిడి ఉత్తర్వులను హరీశ్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘హుజురాబాద్ పట్టణంలో భూమి ఆధీన‌, నీటి కుళాయి, విద్యుత్ కనెక్షన్, ఇంటి అనుమతుల పత్రాలను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందజేశాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చాం. పని చేసే ప్రభుత్వం, పని చేసే నాయకుడు ఉంటే పని ఎంత వేగంగా జరుగుతుందో దీనిని బట్టే అర్థమవుతుంది. కొంత మంది నేతలు తమ బాధలను ప్రజల బాధగా రుద్ది లాభపడుతుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు తెరాస ప్రభుత్వం మాత్రం ప్రజల బాధను తమ బాధగా భావించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. బీజేపీ నాయకులు పెరిగిన సిలిండర్ ధర తగ్గిస్తామని ఎందుకు చెప్పడం లేదు. గడియారాలు, బొట్టు బిళ్లలు కాదు.. దమ్ముంటే వేయి రూపాయలకు పెంచిన సిలండర్ ధర తగ్గిస్తామని హుజూరాబాద్ ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి. బీజేపీకి ఓటు వేస్తే పెంచిన ధరలకు ప్రజలు మద్ధతు ఇస్తున్నారని.. సిలిండర్ ధర మూడు వేలు, మంచి నూనె ధర 300 రూపాయలకు పెంచుతారు. ఓటుకు రెండు వేలు ఈ రోజు చేతిలో పెట్టి, రేపటి నుంచి సిలండర్ ధర మూడు వేలకు పెంచి మళ్లీ మన వద్దే వసూలు చేస్తారు. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి. తెరాస ప్రభుత్వం ప్రజల బాధలను తమ బాధలుగా భావించి.. వృద్దులకు ఆసరా, పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఇస్తోంది. మొన్న వరద వస్తే ఇంటికి 3800 రూపాయలు సాయం అందించాం. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేది తెరాస ప్రభుత్వం కాదా? మాయమాటలు చేప్పే వారివైపు ఉంటారా.. న్యాయం, ధర్మం వైపు ఉంటారా? తన బాధను ప్రజల మీద రుద్ది ఓ పెద్దమనిషి లబ్ధి పొందాలనుకుంటున్నారు. హుజూరాబాద్ సంక్షేమం, అభివృద్ధి ఆగొద్దంటే.. తెరాస ప్రభుత్వాన్ని బలపర్చాలి’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

For More News..

కేసీఆర్ నిద్రపోతున్నాడా.. నా ఇల్లు నాకు కావాలి

 

కేంద్రమంత్రి షెకావత్‎తో కేసీఆర్ భేటీ.. చర్చంతా దానిపైనే..

మద్యం మత్తులో దంపతుల గొడవ.. చిన్నారి మృతి

Tagged Bjp, TRS, Telangana, CM KCR, Eatala Rajender, Huzurabad, Huzurabad By election, Gellu Srinivas, Harisha rao

Latest Videos

Subscribe Now

More News