కేసీఆర్ నిద్రపోతున్నాడా.. నా ఇల్లు నాకు కావాలి

కేసీఆర్ నిద్రపోతున్నాడా.. నా ఇల్లు నాకు కావాలి

రంగారెడ్డి: శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర హైదరాబాద్.. బెంగళూరు జాతీయ రహదారిపై పెద్దషాపూర్ తండా గ్రామస్తులు ధర్నాకు దిగారు. పేదలకు చెందిన ఇందిరమ్మ ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేయడంపై మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన నిర్మల అనే మహిళ 26 ఏళ్లుగా పెద్దషాపూర్‎లో నివాసముంటోంది. ఆమెను భర్త వదిలేయడంతో.. రోజూ వారీ కూలి చేసుకుంటూ జీవిస్తోంది. పైసా.. పైసా.. కూడబెడుతూ నిర్మల.. పెద్దషాపూర్‎లో రూ. 3.50 లక్షలకు ఒక ప్లాట్ కొనుక్కుంది. ఈ మధ్యే వడ్డీకి డబ్బులు తెచ్చుకొని.. ఇంటి నిర్మాణం మొదలుపెట్టింది. అయితే ఆ ఇల్లు స్లాబ్ వరకు వచ్చిన తర్వాత.. అక్రమ కట్టడమంటూ రెవెన్యూ అధికారులు ఇంటిని కూల్చివేశారు. దాంతో నిర్మల మళ్లీ రోడ్డునపడింది. తనకు న్యాయం చేయకపోతే.. అక్కడే కిరోసిన్ పోసుకొని చనిపోతానని అంటోంది. తనకు రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళల పింఛన్ లేదని, ఇల్లు లేదని తెలిపింది. కేసీఆర్‎కు తన ఓటు అయితే కావాలి కానీ, మాలాంటి పేదల కష్టాలు అవసరం లేదని ఆమె వాపోయింది. అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అని చెప్పుకునే కేసీఆర్.. పేదలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నాడు.. నిద్రపోతున్నాడా అని ఆమె ప్రశ్నించింది.

ఈ ఘటనకు కారణమైన రెవెన్యూ ఆఫీసర్ సునీతను సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. పెద్ద షాపూర్ తండావాసుల ధర్నాతో హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై దాదాపుగా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. శంషాబాద్ ఎయిర్‎పోర్ట్ పోలీస్‎స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు తండావాసులతో చర్చలు జరిపారు. బాధ్యులైన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బాధితులు హెచ్చరించారు. ధర్నా చేస్తున్న వారిని పక్కకు పంపించి.. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

For More News..

కేంద్రమంత్రి షెకావత్‎తో కేసీఆర్ భేటీ.. చర్చంతా దానిపైనే..

మద్యం మత్తులో దంపతుల గొడవ.. చిన్నారి మృతి

కొట్లాట నాకు, కేసీఆర్‎కు మాత్రమే.. నాయకులతో కాదు: ఈటల