ఢిల్లీలో ఉండాల్సిన కిషన్ రెడ్డికి ఇక్కడ ఏం పని?

ఢిల్లీలో ఉండాల్సిన కిషన్ రెడ్డికి ఇక్కడ ఏం పని?
  • గెల్లు శ్రీనును గెలిపిస్తే వీణవంకకు డిగ్రీ కాలేజీ  
  • హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు 

కరీంనగర్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ క్యాండిడేట్ గెల్లు శ్రీనివాస్​ను గెలిపిస్తే హుజూరాబాద్​కు మెడికల్ కాలేజీ, వీణవంకకు డిగ్రీ కాలేజీ తెప్పిస్తానని, 3నెలల్లో చల్లూరును మండలంగా చేస్తానని మంత్రి హరీశ్ రావు చెప్పారు. సోమవారం వీణవంక, చల్లూరు గ్రామాల్లో జరిగిన ర్యాలీల్లో మంత్రి హరీశ్ మాట్లాడారు. క్రూడాయిల్ రేట్లు పెరిగినందుకే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. దీనిపై జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కిషన్ రెడ్డి చర్చకు రావాలని హరీశ్ సవాల్ విసిరారు. ఏడేండ్లలో పెట్రోల్ పై పన్నులను కేంద్రం రూ.4 నుంచి 32కు పెంచిందన్నారు. నవంబర్ 2 తర్వాత సిలిండర్ రేటు రూ. 1,200కు చేరుతుందని, పెట్రోల్ రూ. 200, డీజిల్ రూ.150 కావడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే ప్రతి స్కీములో కేంద్రం వాటా ఉందని బీజేపీ నేతలు అంటున్నారని, కేసీఆర్​ కిట్​లో ఐదు పైసల వాటా ఉన్నా ముక్కు నేలకు రాస్తానన్నారు. రైతుబంధు, కల్యాణ లక్ష్మి, ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్ లాంటి స్కీముల్లో కేంద్రానికి పైసా వాటా లేదన్నారు. ఢిల్లీలో ఉండాల్సిన కిషన్ రెడ్డికి ఇక్కడ ఏం పని అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈటల రాజేందర్​ పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇన్నేండ్లు మంత్రిగా ఉన్న ఈటల హైదరాబాద్ లో మెడికల్ కాలేజీ కట్టుకున్నాడు గానీ, నియోజకవర్గానికి ఒక్క డిగ్రీ కాలేజీ తేలేదన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కూడా తేలేదని చెప్పారు. ఈటలను ఎన్నిసార్లు అడిగినా చల్లూరును మండలం చేయలేదన్నారు.