ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా.. హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే: మంత్రి హరీష్ రావు

ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా.. హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే: మంత్రి హరీష్ రావు

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గెలిచాక చేసిందేమీ లేదు.. కానీ, చీరలు, సారెలు ఇస్తుండట అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. రఘునందన్ రావు అరచేతిలో వైకుంఠం చూపెడతానని చెప్పిన మాయ మాటలను దుబ్బాక ప్రజలు నమ్మద్దని సూచించారు.

తెలంగాణలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.. ఎన్ని ట్రిక్కులు కొట్టినా.. చివరికి హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరేనని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. 

 రామలింగారెడ్డి విగ్రహం నా చేతుల మీదుగా ఆవిష్కరిస్తానని ఊహించలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. రామలింగారెడ్డి అంటే వైవిద్యాల సమ్మేళనమని, వామపక్ష భావజాలం, జర్నలిస్టుల సంక్షేమం కోసం, గన్నుతో, పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తిగా అందరి కంటే భిన్నంగా ఉండేవని అభివర్ణించారు. రామలింగారెడ్డి ఆత్మ శాంతి చేకూరాలంటే దుబ్బాక గడ్డమీద గులాబీ జెండా ఎగరాలని చెప్పారు.

ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంతో తెలంగాణ ఉద్యమంలో జోడెడ్లుగా రామలింగారెడ్డి, తాను కలిసి పని చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. మానుకోట, మనోహరాబాద్ రైల్వే రోకో, హైదరాబాద్ ఇందిరా పార్కుల వద్ద ధర్నా, రాస్తారోకో, నిరసనలు 48 గంటలు నిద్రాహారాలు మానుకుని ఈ కార్యక్రమాలను చేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. తన ఆరోగ్యం లెక్క చేయకుండా పని చేసి రామలింగారెడ్డి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 

Also Read :- మోదీ.. దేశానికి ప్రధాన మంత్రి? గుజరాత్ కా?

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో డబుల్ బెబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర స్వర్గీయ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమమైనా ముందుండే నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి అని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.  

భవిష్యత్తులో రామలింగారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఎన్ని సర్వేలు చేసిన మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.