ప్రభుత్వానికి పేరు రావద్దని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి

ప్రభుత్వానికి పేరు రావద్దని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి

సిద్దిపేట జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసింద‌ని, ప్రభుత్వానికి పేరు రావద్దని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని అన్నారు మంత్రి హరీష్ రావు. ఆదివారం గజ్వేల్ లో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు నివాసముంటున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలో మంత్రి పర్యటించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవరు అవునన్నా, కాదన్నా ఇంకా మూడేళ్లు టీఅర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని , దేశంలో ఎక్కడ లేని విధంగా నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తుంద‌ని హ‌రీశ్ అన్నారు. ఒక్కో ఇల్లు విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు

ప్రతిపక్షాలు మనం బ్రతికుండగా ప్రాజెక్ట్ లు కావు, నీళ్లు రావు అని అనేవారని, రైతుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటారని విమర్శించేవార‌ని మంత్రి చెబుతూ.. త్వరలోనే ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామ‌ని, మీకు న్యాయం చేస్తామ‌ని, మీ నమ్మకాన్ని నిలబెడుతామ‌ని చెప్పారు. కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఎలాంటి సహాయం అందించామో మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా అదే సాయం చేస్తామ‌ని చెప్పారు. అందరికీ న్యాయం చేస్తామ‌ని చెప్పారు.

కాంగ్రెస్, బీజేపి పార్టీల చేతిలో నెత్తి లేదు, కత్తి లేదని, ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసినా చివరకు ఏం సాధించారని ప్ర‌శ్నించారు. ప్రాజెక్టు కడుతున్నాం అంటే ముంపు గ్రామంగా ముందున్న గ్రామం రాంపూర్ గ్రామమ‌ని, ప్రభుత్వం మీ గ్రామ ప్ర‌జ‌ల‌ని ఎల్ల‌ప్పుడూ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నారు.