ఇటీవల సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సోమవారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అయ్యప్ప దీక్షదారుల భజనల మధ్య రవితేజ తలపై ఇరుముడి పెట్టుకుని, ఓ పాపను ఎత్తుకుని కనిపించడం ఆకట్టుకుంది.
‘జీవితంలో సరైన సమయంలో కొన్ని కథలు మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథలో మళ్లీ భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా. నమ్మకమే మార్గదర్శకంగా సాగుతున్నా’ అని ఈ సందర్భంగా రవితేజ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తండ్రీకూతుళ్ల మధ్య బలమైన బంధాన్ని చూపించబోతున్నట్టు, మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో రవితేజ కనిపించనున్నారని దర్శకుడు శివ నిర్వాణ చెప్పాడు.
శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కనిపించనుంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఈ ‘ఇరుముడి’ సినిమా మలయాళ హిట్ సినిమా ‘మాలికాపురం’ రీమేక్ అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఈ ప్రచారాన్ని ‘ఇరుముడి’ సినిమా మేకర్స్ ఖండించలేదు. రీమేక్ అని కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పటికి అయితే ప్రస్తుతానికి ఇది పుకారు మాత్రమే.
