- మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు.. నల్గొండ జిల్లా హాలియాలో ఘటన
హాలియా, వెలుగు: బంగారం కోసం వృద్ధురాలిని అతి కిరాతకంగా హత్య చేసి, పాతిపెట్టారు. నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. హాలియా సీఐ దేవిరెడ్డి సతీశ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
హాలియా పట్టణంలో నివాసముంటున్న సుంకిరెడ్డి అనసూయమ్మ (65) అనే వృద్ధురాలు.. దేవరకొండ రోడ్డులో గల ధనలక్ష్మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని చిన్నపాక రాములుకు కొంత డబ్బును అప్పుగా ఇచ్చింది. వాటిని అడిగేందుకు 24న ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లింది. అదే సమయంలో చినపాక రాములు, భార్య ధనలక్ష్మి, పెద్ద కొడుకు గౌరీ కలిసి.. కత్తిపీటతో అనసూయమ్మ తలపై కొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే పడిపోయింది. అదే కత్తిపీటతో అనసూయమ్మ గొంతు కోసి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవి దుద్దులను తీసుకున్నారు. ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వెనుక భాగంలో గోతి తీసి వృద్ధురాలి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు.
అనసూయమ్మ అక్క కూతురు సుశీల స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను ఆధారంగా చేసుకొని సోమవారం ఉదయం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో తనిఖీ చేయగా, పాతిపెట్టిన మృతదేహం గురించి తెలిసింది. బయటకు తీసి చూడగా డెడ్‌బాడీ బాగా కుళ్లిపోయింది. అనంతరం అనుముల తహసీల్దార్ రఘు సమక్షంలో డాక్టర్ల బృందం సంఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించింది.
వృద్ధురాలి మెడలో ఉన్న గోల్డ్ చైన్, చెవి దుద్దుల కోసం ఫాస్ట్ ఫుడ్ నిర్వహకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధురాలు అనసూయమ్మను అతి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. వృద్ధురాలిని హత్య చేసిన ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
వృద్ధ దంపతుల బలి..
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన గజ్జల శంకరయ్య(76), లక్ష్మి(70) దంపతులకు ఇంటికి దగ్గర్లో ఉండే కత్తి శివ అనే యువకుడు నమ్మకస్తుడిగా ఉండేవాడు. వారిద్దరు జ్వరం, జలుబు, దగ్గు ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని తెలుసుకున్న శివ, 2025 అక్టోబర్ 7న ఉదయం ఆరు మాత్రల చొప్పున వారితో మింగించి వెళ్లిపోయాడు. వృద్ధ దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లాక లక్ష్మి మెడలోని బంగారు పుస్తెల తాడును తీసుకొని పరారయ్యాడు. మరుసటి రోజు శంకరయ్య, తర్వాత లక్ష్మి చనిపోయింది.
