పిచ్చికూతలు కూస్తే ఊరుకునేది లేదు

పిచ్చికూతలు కూస్తే ఊరుకునేది లేదు
  •     మంత్రి హరీశ్​రావుకు ఎంపీ అర్వింద్​ హెచ్చరిక
  •     పదవి కాపాడుకునేందుకు విమర్శలు చేస్తున్నారు​
  •     ఆయుష్మాన్​ భారత్​లో ముందే ఎందుకు చేరలేదని నిలదీత

నిజామాబాద్, వెలుగు: పదవిని కాపాడుకునేందుకే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​పై మంత్రి హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ మండిపడ్డారు. తెలుగు ఇంటి మన సోదరి నిర్మలా సీతారామన్​పై పిచ్చికూతలు కూస్తే ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఆయుష్మాన్​ భారత్​లో చేరలేదని నిరూపిస్తే రాజీ నామా చేస్తానన్న హరీశ్​ వ్యాఖ్యలపై అర్వింద్​ స్పందిస్తూ.. ‘‘ఆయుష్మాన్​ భారత్​ ఎప్పుడు పెట్టినవ్​? కొవిడ్​లో లక్షల మంది చనిపోతే ఆయుష్మాన్​ భారత్​ పెట్టలే.. కరోనాతో ట్రీట్​మెంట్​కు లక్షల మంది అప్పులపాలైతే పెట్టలే.. నిన్నగాక మొన్న హుజూరాబాద్​లో టీఆర్​ఎస్​ను ఓడగొడితే అప్పు డు ఆయుష్మాన్​ భారత్​ పెట్టిన్రు. అంతకు ముందు ఎందుకు పెట్టలే?” అని నిలదీశారు. ‘‘నీవు రాజీనా మా చేస్తే ఎంత.. చేయకపోతే ఎంత? మరో 9నెలల్లో ఎన్నికలొస్తున్నయ్​. మీ ప్రభుత్వం ఉండదు” అని అన్నారు. నిజామాబాద్​లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ‘‘ఇందూరు జనతా కో జవాబ్​ దో’’ సభ ను నిర్వహించారు. సభలో ఎంపీ అర్వింద్​ మాట్లాడుతూ.. ప్రజలు చావుదెబ్బ కొట్టిన తర్వాతే ఆయుష్మాన్​ భారత్​లో తెలంగాణ చేరిందని, కరోనా కన్నా ముందే చేరితే రాష్ట్రంలో కరోనాతో వేల మంది ప్రా ణాలు పోయేవి కావన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలకు కల్వకుంట్ల ఫ్యామిలీ బాధ్యత వహించాలన్నారు. సెంట్రల్ గవర్నమెంట్​ స్కీమ్​ల  పేర్లు మార్చలేదని కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరోనాలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  కాపాడారని, అలాంటి తెలుగింటి సోదరిపై తప్పు డు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. 

రేషన్​ వివరాలు అడిగితే తప్పేముంది? 

రేషన్​ వివరాలు కలెక్టర్​ను నిర్మలా సీతారామన్​ అడిగితే తప్పేముందని ధర్మపురి అర్వింద్​ ప్రశ్నించారు. వివరాలు బయటపడితే బండారం బయటపడుతుందని టీఆర్​ఎస్​ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఉద్ధరించలేని కేసీఆర్​ దేశానికి ఏం చేస్తారని నిలదీశారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతికి కేరాఫ్​ గా నిలుస్తున్నదని,  ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో ఆరోపణలు ఉన్న కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అర్వింద్​ డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ ఎదుర్కొవాలన్నారు. ప్రశాంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ మంత్రి అని,  కేసీఆర్​హామీలకు గంగిరెద్దులా తల ఊపారని ఎద్దేవా చేశారు.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కేసీఆర్ ఇచ్చిన హామీలను పూర్తి చేయించే బాధ్యత మంత్రి ప్రశాంత్ రెడ్డిదే అని అన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద జోకరని, టీఆర్​ఎస్​ నేతలంతా ఆయన వారసులని దుయ్యబట్టారు. మంత్రి కేటీఆర్ మత్తులో తూగుతున్నారని విమర్శించారు. తాను పసుపు బోర్డు హామీ ఇచ్చి స్పైసెస్​ బోర్డు తెచ్చానని, రూ. 30 కోట్ల నిధులు తీసుకువచ్చానని  అర్వింద్​ తెలిపారు. గత రెండు ఎన్నికల్లో జిల్లాకు టీఆర్​ఎస్​ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సభలో మాజీ పోలీస్​ అధికారి కృష్ణప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా ప్రెసిడెంట్​ బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యవర్గసభ్యులు అన్నపూర్ణమ్మ, ధన్​పాల్​ సూర్య నారాయణ, నాయకులు అల్జాపూర్​ శ్రీనివాస్​, డా. ఏలేటి మల్లికార్జున్​ రెడ్డి , దినేశ్​ కులాచారి, మేడపాటి ప్రకాశ్​రెడ్డి, మోహన్​ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.