కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై క్రిమినల్ కేసులు

కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై  క్రిమినల్ కేసులు

కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు, కాలం చెల్లిన వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు అటవీ, పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్లాస్టిక్ కి చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్లాస్టిక్ కు ప్రత్యమ్నాయంగా జూట్, క్లాత్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఐకే రెడ్డి. ముంబై తరహాలో.. ప్లాస్టిక్ ను పూర్తిగా బ్యాన్ చేయాల్సిందేనని చెప్పారు. ప్రజలు కూడా దీనిని సామాజిక భాద్యతగా తీసుకోవాలని కోరారు. అరణ్య భవన్ లో అటవీ, పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి.. ఇతర ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష చేశారు మంత్రి. ప్రజల ప్రాణాలకు హానిగా మారిన.. కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి పరిశ్రమలపై నిరంతర నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి చెక్ పెట్టాలన్నారు ఇంద్రకరణ్ రెడ్డి. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా జూట్, క్లాత్ బ్యాగులను అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. నిబంధనలు పాటించకుండా ప్లాస్టిక్ కవర్లను తయారు చేస్తున్న కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. కాలం చెల్లిన వాహనాల నుంచి కాలుష్యంతో స్వచ్ఛమైన గాలి కలుషితమవుతోందన్నారు మంత్రి. తనిఖీలు జరిపి అటువంటి వాహనాలను సీజ్ చేయాలన్నారు. వాయు కాలుష్యంపై అధ్యయనం చేసి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు ఉపయోగ పడేలా బార్క్ టెక్నాలజీ సహాయంతో బియ్యం, కూరగాయలను ప్రాసెస్ చేయడం, ప్రజలకు వాటి ధరలను అందుబాటు ఉండేలా పరిశోధనలు చేయాలని అధికారులకు సూచించారు మంత్రి. వాతావరణ మార్పులకు సంబంధించి ఖచ్చితమైన సమచారం ఇచ్చే విధంగా EPTRI పరిశోధనలు చేయాలన్నారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లో తీవ్ర నీటి సమస్య ఉందని… అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసి చెట్లు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అమీన్ పూర్ చెరువును పరిరక్షించాలని అధికారులకు సూచించారు మంత్రి. అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా భాద్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి అరణ్య భవన్ లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు ఇంద్రకరణ్ రెడ్డి.