నేపాల్లో వరద బీభత్సం .. విరిగిపడుతున్న కొండ చరియలు .. 11 జాతీయ రహదారులు క్లోజ్

నేపాల్లో వరద బీభత్సం .. విరిగిపడుతున్న కొండ చరియలు .. 11 జాతీయ రహదారులు క్లోజ్
  • ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
  • డేంజర్ మార్క్ దాటిన కోషి రివర్    
  • సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాల్లోని జనాలు

ఖట్మాండు: నేపాల్​లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 11 జాతీయ రహదారులను అక్కడి ప్రభుత్వం బ్లాక్ చేసింది. నదులన్నీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయని, తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నేపాల్ వాతావరణ శాఖ అధికారులు ఆదేశించారు. 

తూర్పు నేపాల్​లోని కోషి, తమోర్, అరుణ్, తమకోషి, దూద్​కోషి, కంకై నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోషి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నదని అధికారులు ప్రకటించారు. వరదల ధాటికి ప్రధాన రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. దీంతో రవాణా స్తంభించిపోయింది. ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించుకునేందుకు హైడ్రో పవర్ ప్రాజెక్టుల వద్ద అలర్ట్​గా ఉండాలని పవర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ సూచించింది. బాగామతి నదికి వరద తాకిడి భారీగా పెరిగింది. దీంతో ఖట్మాండు తీవ్రంగా ప్రభావితమైంది. 

మహాకాళితో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సెంట్రల్ నేపాల్​లోని బగలుంగ్, మైగ్డి, పర్బత్, స్యింజా, పల్పా, నావాల్​పారసీ, రూపందేహి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో శంఖువాసభలోని కోషి హైవే, పంచథార్​లోని మెచి హైవే, తమోర్ కారిడార్ రోడ్ సెక్షన్, మిడ్ హిల్ హైవే మూసివేశారు. రసువాలోని పసాంగ్​లాము హైవే, బాంగ్లంగ్​లోని కాళి గండకి కారిడార్, ముస్తాంగ్​లోని జోమ్సోమ్​– లోమంథాంగ్ రోడ్, రోల్పాలోని సాహిద్ హైవే, రుకుమ్ వెస్ట్​లోని జాజర్​కోట్​– డోల్పాభేరి కారిడార్, బైతాడిలోని మహాకాళి హైవే వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి.