గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి

గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి
  • మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి

 
నిర్మల్, వెలుగు:  రాష్ట్ర  గవర్నర్ ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకోవాలని, లేదంటే  గతంలో ఇక్కడ గవర్నర్ గా పని చేసిన రామ్ లాల్ కు పట్టిన గతే పడుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నిర్మల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ పరిధి దాటి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలా గవర్నర్ మాట్లాడడం సమంజసం కాదన్నారు. రాజ్ భవన్ ను రాజకీయ కేంద్రం చేయవద్దన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని రాష్ట్ర, దేశ  ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితేనే ఈ  దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, దేశానికి దిశా నిర్దేశం లభిస్తుందన్నారు.

కేసీఆర్ ఈ  దేశానికి దిక్సూచిలా కనబడుతున్నాడని పేర్కొన్నారు. దేశంలోని పలు రైతు సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు కూడా సీఎం కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేసి అక్కడ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. గవర్నర్ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించడం సమంజసం కాదన్నారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలే తప్ప ఒంటెద్దు పోకడలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను విమర్శించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.