నిర్మల్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన వెనుక మంత్రి హస్తం

నిర్మల్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన వెనుక మంత్రి హస్తం

నిర్మల్, వెలుగు:నిర్మల్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన వెనుక మంత్రి హస్తం ఉందని, ఆయన బంధువుల భూములను కాపాడేందుకు సోఫీ నగర్ లోని  ఇండస్ట్రియల్ జోన్ నుంచి  రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చారని ఏఐసీసీ కార్యక్రమాల  అమలు  కమిటీ  చైర్మన్  ఏలేటి మహేశ్వర్ రెడ్డి  ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ పేరిట రైతుల భూములకు రక్షణ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మంజులాపూర్ లోని రైతుల భూములను ఇండస్ట్రీయల్ జోన్ లోకి మార్చడాన్ని తప్పుబట్టారు. మంత్రి సొంత గ్రామమైన ఎల్లపల్లి భూములతో పాటు చెరువు భూములను గ్రీన్ జోన్ నుంచి కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ లోకి మార్పు చేశారని ఆరోపించారు.  గ్రీన్ జోన్​లో ఉన్న కలెక్టరేట్ ప్రాంతాన్ని  మంత్రి బంధువులు కొనుగోలు చేశారని, ఆ భూములను గ్రీన్ జోన్ నుంచి రెసిడెన్షియల్​జోన్​లోకి మార్చారని ధ్వజమెత్తారు. 

మంత్రి తనపై కక్ష సాధించేందుకే తన ఇంటితోపాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్ నుంచి గ్రీన్ జోన్ లోకి మార్చారని అన్నారు.  తనను ఇబ్బంది పెట్టినా ఫర్వాలేదని, తన  ఇంటి  చుట్టుపక్కల  కాలనీలను,  భూములను గ్రీన్ జోన్ లోకి మార్చడం సమంజసం కాదన్నారు. తనని రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ ఇలాంటి తప్పుడు విధానాలు సరికాదన్నారు. ధర్మసాగర్ చెరువులో భూములను బఫర్ జోన్ నుంచి తప్పించి రిక్రియేషన్ జోన్ గా మార్చడం వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందన్నారు. ప్రస్తుతం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయనట్లయితే   కోర్టు ను కూడా ఆశ్రయిస్తామన్నారు.  ఈ  సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్యంరెడ్డి, జడ్పీటీసీ   రమణారెడ్డి, నాయకులు బాపు రెడ్డి, జమాల్, చిన్ను తదితరులు పాల్గొన్నారు.